NEET UG Retest: నీట్ రీటెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఆన్‌లైన్ పరీక్ష పిటిషన్ తిరస్కరణ!
NEET UG Retest: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం నేపథ్యంలో జూన్ 21న జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ (NEET-UG Retest) విధానంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
NEET UG Retest: దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులను కలవరపెట్టిన 'నీట్' (NEET) ప్రశ్నపత్రం లీకేజీ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నీట్ యూజీ రీటెస్ట్‌కు (NEET-UG Retest) సంబంధించి దాఖలైన ఒక ముఖ్యమైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ రీటెస్ట్‌ను కంప్యూటర్ ఆధారిత (Computer-Based Test - CBT) పద్ధతిలో నిర్వహించాలంటూ వచ్చిన అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఎప్పటిలాగే సాంప్రదాయ ఓఎంఆర్ (OMR) షీట్ పద్ధతిలోనే పరీక్షను కొనసాగించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఆదేశించింది.
పరీక్షా విధానాన్ని ఆన్‌లైన్‌లోకి మార్చాలన్న పిటిషనర్ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. "పరీక్షకు చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పటికే పేపర్ లీకేజీ వివాదంతో ఎన్టీఏ (NTA) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని పూర్తిగా మార్చడం ఆచరణాత్మకంగా చాలా కష్టం" అని న్యాయస్థానం అభిప్రాయపడింది. సమయాభావం, విద్యార్థుల సన్నద్ధతను పరిగణనలోకి తీసుకుని ఓఎంఆర్ విధానమే సరైనదని పేర్కొంది.
భవిష్యత్తులో నీట్ పరీక్షలు పారదర్శకంగా జరగడం కోసం పిటిషనర్ కోర్టు ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఎన్‌క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్లు (Encrypted Question Papers) మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిఘాను పరిశీలించాలని కోరారు. వరుస లోపాల నేపథ్యంలో ఎన్టీఏ స్థానంలో సరికొత్త స్వతంత్ర అథారిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. నీట్ పరీక్షా విధానంలో తీసుకురావాల్సిన సమూల సంస్కరణలు, సాంకేతిక మార్పులపై వచ్చే జులై నెలలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించింది.
ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా తీవ్ర వివాదాల నడుమ రద్దయిన నీట్ పరీక్షను.. దేశవ్యాప్తంగా జూన్ 21న ఎంపిక చేసిన అభ్యర్థులకు తిరిగి నిర్వహించనున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ రీటెస్ట్ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది.




