Southwest Monsoon 2026: వచ్చేశాయి.. కేరళ, తమిళనాడులోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు!
Southwest Monsoon 2026: ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.
Southwest Monsoon 2026: వచ్చేశాయి.. కేరళ, తమిళనాడులోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు!
Southwest Monsoon 2026: తీవ్రమైన భానుడి భగభగలు, మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ సరికొత్త చల్లని కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలోకి ప్రవేశించాయి. భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రుతుపవనాలు కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోకి అధికారికంగా విస్తరించాయి. దీని ప్రభావంతో ఆయా తీర ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణం చల్లబడి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
సాధారణంగా మే నెలాఖరులోనే కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. వాస్తవానికి మే 26వ తేదీనే ఇవి కేరళ తీరానికి వస్తాయని తొలుత ఐఎండీ అంచనా వేసింది. కానీ, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో (El Nino) ప్రభావం కారణంగా ఈ అంచనాలు తలకిందులై, రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది.
రుతుపవనాల రాకతో కేరళలోని పలు జిల్లాల్లో అప్పుడే కుండపోత వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాల ఉధృతి దృష్ట్యా అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. తమిళనాడులోని సుమారు 15 జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వారం రోజుల్లోపే (జూన్ రెండో వారంలో) ఇవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గి, వర్షాలు మొదలుకానున్నాయి.
రుతుపవనాలు వచ్చినప్పటికీ.. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్ నుంచి సెప్టెంబరు వరకు) సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేయడం ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈ సీజన్‌లో కేవలం 90% వర్షం మాత్రమే కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఆవిర్భవిస్తున్న ఎల్‌నినో పరిస్థితులు జూన్‌లో కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ, సెప్టెంబరు నాటికి చాలా బలంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు వివరించారు.




