Sonia Gandhi: పునర్విభజన అంటే రాజ్యాంగంపై దాడే.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Sonia Gandhi: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు.

Arun Chilukuri
Published on: 13 April 2026 12:08 PM IST
Sonia Gandhi
X

Sonia Gandhi: పునర్విభజన అంటే రాజ్యాంగంపై దాడే.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Sonia Gandhi: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే ప్రస్తుతం అత్యంత కీలకమైన మరియు ప్రమాదకరమైన అంశమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆమె అభివర్ణించారు.

ఎన్నికల సమయంలో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ బిల్లును తీసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రధాని మోదీ 'నా మాటే నెగ్గాలి' అన్నట్టు వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల లేఖలను కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

2027 జనాభా లెక్కలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అస్పష్ట సమాచారంతో ఈ ప్రక్రియను నిర్వహించడం సరికాదన్నారు. రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశాల్లో కాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే తీసుకురావాలని సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే ఆలోచనకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి అప్రజాస్వామికంగా ఉందని ఆమె మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story