Sonam Wangchuk : జంతర్ మంతర్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షా శిబిరంపై ఢిల్లీ పోలీస్ యాక్షన్

Sonam Wangchuk : ఢిల్లీలో 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు శనివారం తెల్లవారుజామున బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

CR Reddy
Published on: 18 July 2026 8:28 AM IST
Sonam Wangchuk
X

Sonam Wangchuk

Sonam Wangchuk : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత మూడు వారాలుగా సాగుతున్న నీట్ పరీక్షల అక్రమాల వ్యతిరేక ఉద్యమం శనివారం తెల్లవారుజామున ఒక ఉత్కంఠభరిత మలుపు తిరిగింది. లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు ఆయనను బలవంతంగా దీక్షా స్థలి నుంచి తొలగించి ఆసుపత్రికి తరలించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున, పార్లమెంట్ మార్చ్ నిర్వహించేందుకు వాంగ్‌చుక్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మార్చ్‌కు కేవలం 48 గంటల ముందే పోలీసులు ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం.

పోలీసుల ఈ ఆకస్మిక చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తనపై భౌతిక దాడికి దిగారని అభిజీత్ దిప్కే సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. "ఢిల్లీ పోలీసులు నన్ను కొట్టి, డిటెన్షన్‌లో ఉంచారు" అని ఆయన ఎక్స్‎లో పోస్ట్ చేశారు. కాగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మిగిలిన ఆందోళనకారులు కూడా తక్షణమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి శాంతియుతంగా వెళ్లాలని న్యూఢిల్లీ డీసీపీ సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు.

వైద్యుల హెచ్చరికలతోనే తరలింపు

ఈ అరెస్టులపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో వైద్య నిపుణుల సలహా మేరకు, అలాగే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుంచివాంగ్‌చుక్ దాదాపు 9 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గారు. ఆయన ఆరోగ్యం అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుందని, ఇలాగే దీక్ష కొనసాగితే శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు డాక్టర్ సతీష్ లంబా హెచ్చరించారు. మానసికంగా ఆయన చురుగ్గానే ఉన్నప్పటికీ, శారీరక స్థితి ఆందోళనకరంగా మారడంతోనే అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు.

ఉల్లిపాయలకే ప్రభుత్వాలు కూలిపోయాయి

ఆసుపత్రికి తరలించడానికి కొన్ని గంటల ముందు, అంటే తన దీక్ష 20వ రోజు ముగింపులో సోనమ్ వాంగ్‌చుక్ ఒక ఎమోషనల్ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. "నేను ఇంకా బతికే ఉన్నాను. నా శరీరంలో 20 శాతం కరిగిపోయింది. కొవ్వులు, కండరాలు కరిగిపోయాయి. ఆ తర్వాత అవయవాలు, చివరిగా మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అయితే ఆ సమయం ఇంకా రాలేదు, నా మెదడు బాగుంది" అంటూ మద్దతుదారుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. నీట్ పరీక్షల లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అనే అనుమానాలపై ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉల్లిపాయల ధరలు పెరిగితేనే గతంలో మూడుసార్లు (1980లో కేంద్ర ప్రభుత్వం, 1998లో ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలు) ప్రభుత్వాలు కూలిపోయాయని గుర్తుచేశారు. ఉల్లిపాయల ధరలకే అంతలా స్పందించిన భారత ప్రజలు, తమ పిల్లల ప్రాణాలు, విద్య విషయానికి వస్తే అంతకంటే పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలరని వ్యాఖ్యానించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్

గత జూన్ 20 నుంచికాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు నిరంతరాయంగా సాగుతున్నాయి. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరపాలని, పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని, ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 28న ఈ ఉద్యమంలో చేరిన సోనమ్ వాంగ్‌చుక్, అప్పటి నుంచిదేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, జూలై 20న జరగబోయే పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story