Sonam Wangchuk: విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలి.. కేంద్రానికి వాంగ్‌చుక్ కీలక విజ్ఞప్తి!
Sonam Wangchuk: యువతకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకమే కీలకమని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.
Sonam Wangchuk: విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలి.. కేంద్రానికి వాంగ్‌చుక్ కీలక విజ్ఞప్తి!
Sonam Wangchuk: దేశంలో యువతకు, ప్రభుత్వానికి మధ్య పరస్పర నమ్మకమే అత్యంత కీలకమని, అప్పుడే అద్భుతమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘పబ్లిక్ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026’ (Public Examinations Amendment Bill 2026) ని ఆయన మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ చట్టం కేవలం పరీక్షల్లో అక్రమాలను అరికట్టడమే కాకుండా, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎక్స్ (X) వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో చోటు చేసుకున్న విద్యార్థుల ఆందోళనలపై కూడా వాంగ్‌చుక్ స్పందించారు. ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కోరారు. ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) తక్షణమే కొట్టివేయాలని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) పదేపదే డిమాండ్ చేయడం, లేదంటే మళ్లీ ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించిన అనుభవాన్ని పంచుకుంటూ.. భారతీయ రైల్వే అభివృద్ధిని చూస్తే ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'చీనాబ్ రైల్వే వంతెన'పై ప్రయాణించడం మరవలేని అద్భుత అనుభూతిని ఇచ్చిందని కొనియాడారు. తన బృందంతో కలిసి ఒక రోజు కశ్మీర్‌లో గడిపిన అనంతరం లద్దాఖ్‌కు పయనం కానున్నట్లు వాంగ్‌చుక్ వెల్లడించారు.




