Fixed Deposit Rates: రూ. 5 లక్షలపై రూ. 2.40 లక్షల లాభం..ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అంటే..?
Fixed Deposit Rates: ఆర్‌బీఐ రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచిన నేపథ్యంలో, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
Fixed Deposit Rates
RBI Repo Rate: తమ కష్టార్జితాన్ని సురక్షితంగా దాచుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం డిపాజిటర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ముగిసిన మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు.
రెపో రేటు యథాతథం..
గత ఏడాది కాలంలో ఆర్‌బీఐ రెపో రేటును 1.25 శాతం మేర తగ్గించడంతో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను కోత కోశాయి. అయితే తాజాగా జరిగిన సమావేశంలో రెపో రేటును 5.25 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. దీనివల్ల బ్యాంకులు కూడా తమ ఎఫ్‌డీ రేట్లను ప్రస్తుతానికి అలాగే కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి, మరిన్ని కోతలు పడకముందే మంచి వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీరు రూ. 5 లక్షలను డిపాజిట్ చేయాలనుకుంటే, ఏ టెన్యూర్‌లో ఏ బ్యాంకు ఎంత లాభం ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.
ఏడాది కాలానికి..
తక్కువ కాలపరిమితిలో డబ్బు వెనక్కి కావాలనుకునే వారికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉన్నాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 7.25% వడ్డీని తమ ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు అందిస్తున్నాయి. ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా 7.10%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 6.50%. మీరు 7.25 శాతం వడ్డీతో రూ. 5 లక్షలు జమ చేస్తే, ఏడాది తర్వాత మీ చేతికి రూ. 5,37,248 అందుతాయి.
మూడేళ్ల కాలానికి ..
మీరు కొంత దీర్ఘకాలం పాటు డబ్బును ఉంచగలిగితే వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటు అధికంగా ఇచ్చే బ్యాంకులు.. జన, స్లైస్ , ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 7.50% వడ్డీని ఇస్తున్నాయి. బంధన్ బ్యాంక్ 7.25%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.30% వడ్డీని ఇస్తున్నాయి. గరిష్ఠంగా 7.50 శాతం వడ్డీతో రూ. 5 లక్షలు మూడేళ్ల పాటు ఉంచితే, మెచ్యూరిటీ తర్వాత రూ. 6,24,858 లభిస్తాయి. సుమారు రూ. 1.24 లక్షల లాభం అన్నమాట.
ఐదేళ్ల కాలానికి..
మరింత ఎక్కువ వడ్డీ , దీర్ఘకాలిక భద్రత కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 7.90% వడ్డీ, డీసీబీ బ్యాంక్ 7.15%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.30% వడ్డీని అందిస్తున్నాయి. అత్యధికంగా 7.90 శాతం వడ్డీతో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, ఐదేళ్ల తర్వాత మీ డబ్బు రూ. 7,39,340 అవుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు రూ. 2.40 లక్షలు అదనంగా వస్తాయి.
ద్రవ్యోల్బణం, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో స్థిరమైన ఆదాయం కోసం ఎఫ్‌డీలు ఉత్తమ మార్గం. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 1 నుండి 1.5 శాతం వరకు అదనపు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మీ అవసరానికి తగ్గట్టుగా కాలపరిమితిని ఎంచుకుని, అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ సంపదను పెంచుకోవచ్చు.


