RBI Forex Swap Schemes: రూపాయికి తిరుగులేదు.. $50 బిలియన్ల సర్ ప్లస్ దిశగా భారత్!
RBI Forex Swap Schemes: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రవేశపెట్టిన మూడు ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ స్కీమ్‌లకు అనూహ్య స్పందన లభిస్తోంది.
RBI Forex Swap Schemes: రూపాయికి తిరుగులేదు.. $50 బిలియన్ల సర్ ప్లస్ దిశగా భారత్!
RBI Forex Swap Schemes: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల ప్రవేశపెట్టిన మూడు ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ స్కీమ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా దేశంలోకి సుమారు 80 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ప్రవహిస్తుందని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. మార్కెట్ నుంచి లభిస్తున్న అద్భుతమైన స్పందనతో ఇప్పటికే 56 బిలియన్ డాలర్లకు పైగా నిధులను ఆర్బీఐ సమీకరించిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇది భారత్ యొక్క బలమైన ఆర్థిక మూలాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
దేశ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేసే ప్రధాన లక్ష్యంతో ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ ఈ రాయితీ డాలర్-రూపీ స్వాప్ పథకాలను ప్రారంభించింది. వీటిలో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ (ఎఫ్సీఎన్ఆర్-బి) డిపాజిట్ల పథకం రికార్డు స్థాయి నిధులను ఆకర్షించింది.
కేవలం ఈ ఒక్క స్కీమ్ ద్వారానే సుమారు 52.3 బిలియన్ డాలర్లు రావడం గమనార్హం. ఆశింఛిన దానికంటే ఎక్కువ స్పందన లభించడంతో, ఈ పథకాన్ని నిర్ణీత గడువు కంటే ఒక నెల ముందే (ఆగస్టు చివరినాటికి) ముగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, మిగిలిన రెండు స్వాప్ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఈ భారీ విదేశీ నిధుల ప్రవాహం ఫలితంగా దేశ ఫారెక్స్ నిల్వలు ఇటీవలే $707 బిలియన్ల ఆల్-టైమ్ హై మార్కును చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. కేవలం ఒకే వారంలో నిల్వలు 14 బిలియన్ డాలర్లకు పైగా పెరగడంలో ఈ స్వాప్ స్కీమ్‌లు కీలక పాత్ర పోషించాయి. ఈ పథకాల ద్వారా సమకూరిన డాలర్లను ఆర్బీఐ తన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)లో జమ చేయడం ద్వారా విదేశీ నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది.
ఈ నిధుల ఇన్‌ఫ్లోల వల్ల 2027 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ చెల్లింపుల బ్యాలెన్స్ (BoP) లోటు నుంచి బయటపడి, సుమారు 50 బిలియన్ డాలర్ల మిగులు (Surplus) దిశగా పయనిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో, ఈ పరిణామం భారత రూపాయికి బలమైన మద్దతును ఇవ్వడమే కాకుండా దేశ బాహ్య ఆర్థిక స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేయనుంది.




