Mallikarjun Kharge: రాజ్యసభలో ఖర్గే తీవ్ర ఆగ్రహం: "నా ప్రసంగం ముగిశాక వేదికను శుద్ధి చేశారు!"

Mallikarjun Kharge: ఉత్తరాఖండ్ ర్యాలీ వేదిక శుద్ధీకరణ ఘటనపై రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 2:08 PM IST
Mallikarjun Kharge
X

Mallikarjun Kharge: రాజ్యసభలో ఖర్గే తీవ్ర ఆగ్రహం: "నా ప్రసంగం ముగిశాక వేదికను శుద్ధి చేశారు!"

Mallikarjun Kharge: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముగింపు రోజున ఎగువ సభ (రాజ్యసభ)లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదానంలో ఇటీవల తాను పాల్గొన్న బహిరంగ సభ ముగిసిన అనంతరం, కొందరు వ్యక్తులు ఆ వేదిక వద్ద ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించారని రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, అదొక దురదృష్టకర సంఘటన అని, బీజేపీ ఇలాంటి చర్యలను ఏమాత్రం సమర్థించదని వివరణ ఇచ్చారు.

హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో లక్షలాది మంది హాజరైన ర్యాలీలో తాను ప్రజా సమస్యల గురించే మాట్లాడానని ఖర్గే తెలిపారు. ఏ వర్గాన్ని లేదా మతాన్ని ఉద్దేశించి మాట్లాడకపోయినా, తన ప్రసంగం ముగిసిన రెండు రోజుల తర్వాత కొందరు అక్కడ శుద్ధీకరణ చేపట్టడం దళిత సామాజిక వర్గాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య బీజేపీ కార్యకర్తల పనేనని ఖర్గే ఆరోపించగా, కాంగ్రెస్ ఎంపీలు వారికి మద్దతుగా సభలో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్, ఈ ప్రపంచంలో అంటరానితనానికి మించిన పాపం మరొకటి లేదని స్పష్టం చేశారు. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదని, ఘటనకు కారణమైన వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఖర్గే ఆరోపణలను కేంద్రమంత్రి జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఇటువంటి అంశాలను ఎప్పుడూ ప్రోత్సహించదని, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని సభలో హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story