Delhi: ఢిల్లీలో రాహుల్ గాంధీ మెరుపు ధర్నా.. ఎఫ్‌ఐఆర్ నమోదుతో విరమణ!
Delhi: జంతర్ మంతర్ వద్ద విద్యార్థిపై పెల్లెట్ గన్ కాల్పుల ఘటనపై ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఆందోళన విరమణ.
Delhi: ఢిల్లీలో రాహుల్ గాంధీ మెరుపు ధర్నా.. ఎఫ్‌ఐఆర్ నమోదుతో విరమణ!
Delhi: ఢిల్లీలోని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించిన ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థి సాహిల్ లోచబ్ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మెరుపు ధర్నాకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అంతేకాదు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు.
జులై 20న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలీసులు పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనలో విద్యార్థి సాహిల్‌కు పెల్లెట్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతేకాదు ఒక కంటి చూపు ప్రమాదంలో పడిందని రాహుల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాహిల్ లోచబ్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును తీసుకుని రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ కేసు నమోదు కాకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దే ధర్నా చేపట్టారు.
రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన విషయం తెలియడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాహుల్‌కు మద్దతు తెలిపారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదుపై స్పష్టత వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని తెలిపారు.
ఇందుకు సంబంధించి కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం బాధిత విద్యార్థి సాహిల్ లోచబ్ ఆగస్టు 14న తన న్యాయవాదులతో కలిసి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. పెల్లెట్ గన్ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. అయితే పోలీసులు ఐవో నంబర్ లేదా ఫిర్యాదు స్వీకరణకు సంబంధించిన రసీదు ఇవ్వలేదని పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఆ తరువాత ఆగస్టు 17న కూడా ఈ విషయంపై ఈమెయిల్, ఫోన్ ద్వారా పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతో రాహుల్ గాంధీ సహాయం సాహిల్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే, రాహుల్ మెరుపు ధర్నాపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు.రాహుల్ గాంధీ అరాచక రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. రాహుల్ ప్రస్తావిస్తున్న ఘటనపై ఇప్పటికే ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆయన వెల్లడించారు. అంతేకాదు సదరు ఎఫ్ ఐ ఆర్ పై దర్యాప్తు జరుగుతోందన్న విషయాన్ని రాహుల్ కు పోలీసులు తెలియజేశారన్నారు. అలాగే దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.




