Quit India Movement Day 2026: క్విట్ ఇండియా... దేశంలో స్పూర్తి నింపిన విప్లవం... నేటి తరానికి ఇదే ఆదర్శం
నాయకులు లేకున్నా ఒక సమస్యపై ప్రజలు కూడా ఉద్యమించగలరని తెలియజేసిన విప్లవం క్విట్ ఇండియా మూవ్‌మెంట్. బ్రిటీషర్లను గడగడలాడించిన ఈ విప్లవం ప్రజల్లో ఎలాంటి స్పూర్తిని నింపిందో తెలుసుకుందాం.
Quit India Movement Day 2026: బ్రిటీషర్లను వణికించిన డూ ఆర్ డై నినాదం ఎలా మొదలైందో తెలుసా?... నాయకులను జైలుకు పంపినా ఉద్యమం ఎందుకు ఆగలేదు... ప్రజా విప్లవంగా మారిన క్విట్ ఇండియా మూవ్‌మెంట్... 1942 ఆగస్టు 8న మొదలైన ఈ ఉద్యమం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రంగా ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకుందాం.
భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా, దేశ ప్రజలందరినీ ఒకే లక్ష్యంతో ఏకం చేసిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటీష్ పాలనకు ఇక ముగింపు తప్పదని ప్రపంచానికి చాటిచెప్పిన ఈ ఉద్యమం, భారత స్వాతంత్య్ర చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచింది. 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ ఇచ్చిన "డు ఆర్ డై" పిలుపు కోట్లాది మంది భారతీయుల్లో స్వేచ్ఛా జ్వాలను రగిలించింది. అదే నేటి స్వాతంత్య్రానికి పునాది వేసింది. దీనిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 8ను క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంగా, లేదా ఆగస్ట్ క్రాంతి దివస్‌గా దేశవ్యాప్తంగా గౌరవంగా నిర్వహించుకుంటున్నాం.
యుద్ధమే ఉద్యమానికి కారణం
1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత ప్రజల అభిప్రాయం తీసుకోకుండా బ్రిటీష్ ప్రభుత్వం దేశాన్ని యుద్ధంలోకి దింపింది. ఈ నిర్ణయం భారతీయ నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. అదే సమయంలో ఆసియాలో జపాన్ దళాల దూకుడు పెరగడం, 1942లో బర్మా వరకు చేరుకోవడం బ్రిటీష్ పాలనపై అనుమానాలను మరింత పెంచింది. భారతీయుల మద్దతు కోసం బ్రిటన్ పంపిన క్రిప్స్ మిషన్ కూడా విఫలమైంది. స్వాతంత్య్రంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర నిరాశకు గురైంది. ఈ పరిణామాలే చివరకు బ్రిటీష్ పాలనను పూర్తిగా ముగించాలనే డిమాండ్‌కు దారితీశాయి.
చరిత్ర సృష్టించిన ఆగస్టు 8
1942 ఆగస్టు 8న బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదాన్‌లో జరిగిన సమావేశం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చేసిన ప్రసంగం దేశ ప్రజల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపింది. డూ ఆర్ డై అనే గాంధీజీ పిలుపు దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. ఆ తరువాత ఈ మైదానం ఆగస్ట్ క్రాంతి మైదాన్ పేరుతో చరిత్రలో నిలిచిపోయింది.
ప్రజలే నాయకులై నడిపిన ఉద్యమం
ఉద్యమం ప్రారంభమైన మరుసటి రోజే, అంటే 1942 ఆగస్టు 9 తెల్లవారుజామున, బ్రిటీష్ ప్రభుత్వం "ఆపరేషన్ జీరో అవర్" పేరుతో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సహా కాంగ్రెస్ అగ్రనేతలందరినీ అరెస్టు చేసింది. అయితే బ్రిటీష్ ప్రభుత్వం ఊహించని విషయం జరిగింది. నాయకులు లేకున్నా ఉద్యమం ఆగలేదు. దేశ ప్రజలే స్వయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగరవేయడం, రైల్వే మార్గాలను అడ్డుకోవడం, సమాచార వ్యవస్థలను స్తంభింపజేయడం వంటి నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. నాయకులు లేకుంటే ప్రజలు ముందుకు రారని అనుకున్న బ్రిటీష్ పాలకులకు ప్రజలు షాకిచ్చారు.
అరుణా అసఫ్ అలీ ధైర్యం
అగ్రనేతలందరూ జైలులో ఉన్న సమయంలో ఉద్యమానికి కొత్త ఊపు తీసుకొచ్చింది అరుణా అసఫ్ అలీ. గవాలియా ట్యాంక్ మైదాన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఉద్యమాన్ని కొనసాగించారు. ఆమె ధైర్యసాహసాలు మహిళలకు మాత్రమే కాదు, మొత్తం దేశానికే స్ఫూర్తిగా నిలిచాయి. అదే సమయంలో ఉషా మెహతా రహస్య కాంగ్రెస్ రేడియోను నిర్వహిస్తూ ఉద్యమ వార్తలను ప్రజలకు చేరవేశారు. జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి యువ నాయకులు గెరిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యమ జ్వాల
క్విట్ ఇండియా ఉద్యమం ప్రభావం తెలుగు ప్రాంతాలపై కూడా స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని గుంటూరు, తెనాలి, భీమవరం ప్రాంతాల్లో భారీ నిరసనలు జరిగాయి. తెనాలి రైల్వే స్టేషన్ దహనం వంటి ఘటనలు ఉద్యమ తీవ్రతను తెలియజేశాయి. హైదరాబాద్ సంస్థానంలో స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో కూడా స్వాతంత్య్ర నినాదాలు మారుమోగాయి. ప్రాంతీయ వారీగా ఏకైక నినాదంతో ఉద్యమం జరగడంతో బ్రిటీషర్లు అవాక్కయ్యారు. వార్తలు వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో ఉద్యమం దేశవ్యాప్తంగా పెల్లుబికింది.
బ్రిటీష్ పాలనకు చివరి హెచ్చరిక
బ్రిటీష్ ప్రభుత్వం లక్షలాది మందిని అరెస్టు చేసింది. కాల్పులు జరిపింది. అనేక ప్రాంతాల్లో తీవ్ర అణచివేతకు పాల్పడింది. అయినప్పటికీ ప్రజల్లో స్వాతంత్య్ర ఆకాంక్షను అణచలేకపోయింది. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత భారతీయ సైన్యం, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా బ్రిటీష్ పాలనపై విశ్వాసం తగ్గిపోయింది. భారతీయుల సహకారం లేకుండా దేశాన్ని పాలించడం అసాధ్యమని బ్రిటన్ గ్రహించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అధికార మార్పిడికి చర్యలు ప్రారంభమయ్యాయి. చివరకు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది.
క్విట్ ఇండియా ఉద్యమం మనకు నేర్పిన పాఠం
క్విట్ ఇండియా ఉద్యమం కేవలం స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం మాత్రమే కాదు. దేశ ప్రజలు ఐక్యంగా ఉంటే ఎంతటి శక్తినైనా ఎదుర్కోగలరని నిరూపించిన ఉద్యమం. నాయకులు లేకున్నా ప్రజలే నాయకత్వం వహించి చరిత్రను మార్చగలరని ప్రపంచానికి చూపించింది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యం, ఐక్యత, త్యాగం, దేశభక్తి వంటి విలువలకు ప్రతీకగా నిలిచింది. నేటి యువతకు కూడా ఇది ఒక గొప్ప స్ఫూర్తి. స్వేచ్ఛ అనేది సులభంగా రాలేదని, లక్షలాది మంది త్యాగాల ఫలితమేనని ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాల్సిన సందర్భమే క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం. ఆగస్టు 8 ప్రతి సంవత్సరం మనకు ఒక సందేశాన్ని గుర్తు చేస్తుంది... స్వాతంత్య్రం కోసం పోరాడిన తరాన్ని గౌరవించడం మాత్రమే కాదు, వారు సాధించిన స్వేచ్ఛను కాపాడుకోవడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని మసలుకుంటే దేశం ఎప్పటికీ స్వేచ్ఛావాయువులు పీలుస్తూనే ఉంటుంది.




