Ketan Murder Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో సరికొత్త ట్విస్ట్: లై డిటెక్టర్ పరీక్షకు ‘నో’ చెప్పిన సియా, చేతన్..

Ketan Murder Case: పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక ట్విస్ట్. లై డిటెక్టర్ పరీక్షలకు నిందితురాలు సియా గోయెల్, ఆమె ప్రియుడు నిరాకరించారు. దీంతో కోర్టు వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Arun Chilukuri
Published on: 4 July 2026 12:11 PM IST
Ketan Murder Case
X

Ketan Murder Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో సరికొత్త ట్విస్ట్: లై డిటెక్టర్ పరీక్షకు ‘నో’ చెప్పిన సియా, చేతన్..

Ketan Murder Case: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ 25 ఏళ్ల వ్యాపారవేత్త, రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిజాలను నిగ్గుతేల్చేందుకు నిందితులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలన్న పోలీసుల ప్రయత్నాలకు గండిపడింది. పరీక్షలకు నిందితురాలు సియా గోయెల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి నిరాకరించారు. కాగా, నిందితుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు శనివారం వారిని వడ్గావ్ మావల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆ ఇద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి తోసి కేతన్ అగర్వాల్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు అతడితో నిశ్చితార్థం జరిగిన 20 ఏళ్ల సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి (22) లపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులో ఈ మారుమూల హత్య వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఇద్దరూ కలిసి మే నెలలోనే పుణెలోని లూల్లానగర్ సమీపంలో ఉన్న ఒక క్లబ్ వద్ద.. కొండపై నుంచి ఒక వ్యక్తిని ఎలా తోసేయాలో 'రిహార్సల్' కూడా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసును ఛేదించేందుకు లోనావాలా గ్రామీణ పోలీసులు పక్కా ఆధారాలను సేకరించారు. జూలై 2న నిందితురాలు సియాను లోహగఢ్ కోట వద్దకు తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేశారు. హత్య జరిగిన రోజు ఆమె ధరించిన దుస్తులను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నిందితుల మొబైల్ డేటా, చాటింగ్స్, కాల్ రికార్డ్స్, లొకేషన్ వివరాలు సహా బలమైన సాంకేతిక, డిజిటల్ సాక్ష్యాలను పోలీసులు ఇప్పటికే కోర్టుకు సమర్పించారు.

కేసులో ఇంకా దాగి ఉన్న మరిన్ని రహస్యాలు, లూప్‌హోల్స్‌ను రాబట్టడానికి పోలీసులకు లై డిటెక్టర్ పరీక్షలు అత్యంత కీలకంగా మారాయి. అయితే, నిందితుల సమ్మతి లేకుండా ఈ పరీక్షలు చేయడం కుదరదు. కోర్టు దీనిపై నిందితుల అభిప్రాయాన్ని కోరగా, వారు పరీక్షలకు నిరాకరించడంతో పోలీసుల తదుపరి దర్యాప్తు వ్యూహానికి తాత్కాలిక బ్రేక్ పడినట్లయింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జైలుకు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story