Alimony: రూ. 1.41 లక్షల జీతం ఉన్న భార్యకు.. రూ. 1.35 లక్షల భరణం..కోర్టు సంచలన తీర్పు
Pune Court : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఒకటే రచ్చ. ఇదెక్కడి న్యాయం సామీ? అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.
Alimony: రూ. 1.41 లక్షల జీతం ఉన్న భార్యకు.. రూ. 1.35 లక్షల భరణం..కోర్టు సంచలన తీర్పు
Pune Court: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఒకటే రచ్చ. ఇదెక్కడి న్యాయం సామీ? అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లయిన కేవలం ఆరు నెలలకే విడాకుల బాట పట్టిన ఒక సాఫ్ట్‌వేర్ దంపతుల కేసులో పుణె కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా భార్యకు ఆదాయ వనరులు లేనప్పుడు లేదా చాలా తక్కువ సంపాదన ఉన్నప్పుడు కోర్టులు భర్త నుంచి భరణం ఇప్పిస్తుంటాయి. కానీ, ఈ కేసులో సీన్ రివర్స్ అయింది. భార్య ఇప్పటికే నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్నా.. భర్త జీతంలో దాదాపు సగాన్ని ఆమెకు కట్టబెట్టాలంటూ కోర్టు ఇచ్చిన ఆర్డర్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
అసలేం జరిగిందంటే..?
పుణెకు చెందిన ఐటీ ఉద్యోగులైన ఈ దంపతులకు పెళ్లయి ఆరు నెలలు కూడా గడవకముందే మనస్పర్థలు వచ్చాయి. ఇక కలిసి బతకలేం అనుకుని విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. అయితే కోర్టులో భార్య తరపున వినిపించిన వాదన అందరినీ ఆశ్చర్యపరిచింది. భార్య వాదన ఏంటంటే ?.. నాకు నెలకు రూ.1.41 లక్షల జీతం వస్తోంది.. ఒంటరిగా బతకడానికి ఇది ఎక్కువే కావచ్చు. కానీ, పెళ్లయిన ఈ ఆరు నెలల్లో మా భర్త ఇంట్లో నేను ఎంతో లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను అనుభవించాను. విడాకుల తర్వాత కూడా అదే విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించే హక్కు నాకు ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా నాకు అదనపు డబ్బు కావాలి.
ఈ విచిత్రమైన లగ్జరీ లైఫ్ లాజిక్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. భర్త తన జీతం నుంచి ప్రతి నెలా రూ.1.35 లక్షలను భార్యకు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. అంటే.. కష్టపడి రూ.2.79 లక్షలు సంపాదిస్తున్న భర్త చేతిలో మిగిలేది కేవలం రూ.1.44 లక్షలే. కానీ, భార్య మాత్రం సొంత జీతం, భరణం కలుపుకుని నెలకు ఏకంగా రూ.2.76 లక్షలతో ఎంజాయ్ చేయనుంది. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. భర్త చెల్లించే ఈ భరణం మొత్తం వ్యక్తిగత ఖర్చుల కిందకు వస్తుందట. దీనివల్ల అతనికి ఆదాయపన్ను నుంచి ఎలాంటి మినహాయింపు దక్కదు. అంటే, భర్త తన పూర్తి జీతం మీద ప్రభుత్వానికి పన్ను కట్టాలి.. ఆ పన్ను కట్టిన తర్వాత మిగిలిన దాంట్లోంచి సగాన్ని భార్యకు ఇచ్చుకోవాలి. చట్టప్రకారం భార్యకు అందే ఈ భరణంపై ఆమెకు ఎలాంటి పన్ను పడదు.
ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు, ముఖ్యంగా పురుషుల హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం? బాగా సంపాదిస్తున్న మహిళకు కూడా ఇంత భరణం ఇవ్వాలా? అని ఒకరు ప్రశ్నిస్తే.. కేవలం 6 నెలల పెళ్లికి జీవితకాలపు శిక్షా? ఆ భర్త తల్లిదండ్రుల బాధ్యత, అతని భవిష్యత్తు కోర్టులకు పట్టవా? అంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ లెక్కన పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద ఫైనాన్షియల్ రిస్క్ లా మారిపోయింది" అంటూ యువత కామెంట్లు పెడుతున్నారు. ఈ తీర్పు సమాజంలో సమానత్వం, భరణం చట్టాల దుర్వినియోగంపై సరికొత్త చర్చకు తెరలేపింది. బాగా చదువుకుని, స్వయం సమృద్ధి ఉన్న మహిళల విషయంలో కూడా ఇలాంటి తీర్పులు రావడం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.




