PM Modi : మోదీ 5 దేశాల పర్యటన షురూ.. యూఏఈతో భారీ డీల్స్.. ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?

PM Modi : ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. యూఏఈతో ఎల్పీజీ, చమురు నిల్వలపై కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.

CR Reddy
Published on: 15 May 2026 7:39 AM IST
PM Modi
X

 PM Modi

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి ఐదు దేశాల అత్యంత కీలక పర్యటనను ప్రారంభించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదురుతున్న తరుణంలో, భారత ఇంధన అవసరాలను తీర్చుకోవడమే లక్ష్యంగా మోదీ ఈ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా మొదటి రోజైన మే 15న అబుదాబి చేరుకోనున్న మోదీ, అక్కడ ఇంధన భద్రతపై చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకోబోతున్నారు.

హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‎లో ఇరాన్ సముద్ర రవాణాను అడ్డుకుంటోంది. దీనివల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లైకి విఘాతం కలిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్‌కు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా యూఏఈ నిలుస్తోంది. మన దేశానికి అవసరమైన ఎల్పీజీ‎లో దాదాపు 40 శాతం ఒక్క యూఏఈ నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు కీలక సంతకాలు చేయనున్నారు.

ఏయే రంగాలపై ఫోకస్?

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) మధ్య ఎల్పీజీ వ్యూహాత్మక సరఫరాపై ఒప్పందం కుదరనుంది. అలాగే, మంగళూరులో ఉన్న భారత పెట్రోలియం నిల్వ కేంద్రాల్లో మరిన్ని ముడి చమురు నిల్వలను ఉంచేలా స్ట్రేటజిక్ ఆయిల్ రిజర్వ్ ఒప్పందంపై కూడా చర్చలు జరగనున్నాయి. కేవలం ఇంధనమే కాకుండా.. ఆర్థిక, సాంస్కృతిక,వ్యూహాత్మక రంగాల్లో రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

వ్యూహాత్మక చమురు నిల్వలు

భారతదేశం తన అత్యవసర అవసరాల కోసం మంగళూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భూగర్భ చమురు నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇండియా వద్ద 53.3 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వ సామర్థ్యం ఉంది. 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం మంగళూరు ఫెసిలిటీలో యూఏఈ 50 లక్షల బ్యారెళ్ల చమురును నిల్వ చేస్తోంది. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా భవిష్యత్తులో యుద్ధాలు వచ్చినా మనకు ఇంధన కొరత లేకుండా చూసుకోవడమే మోదీ ప్లాన్. యూఏఈ పర్యటన ముగిశాక, మోదీ యూరోపియన్ దేశాల్లో పర్యటించి టెక్నాలజీ, పర్యావరణ రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story