ఇన్‌స్టాగ్రామ్‌లో 'రీల్స్ చేయండి.. యువతతో కనెక్ట్ అవ్వండి'.. మంత్రులకు మోదీ కొత్త మంత్రం!
యువతతో మరింత అనుసంధానం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, షార్ట్ వీడియోలు చేయాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు.
PM Modi Urges Ministers to Use Instagram Reels to Reach Youth
కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరింత చురుకుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగిస్తున్నందున వారితో నేరుగా అనుసంధానం పెంచుకునేలా రీల్స్, షార్ట్ వీడియోలు, ఇంటరాక్టివ్ పోస్టులను ఎక్కువగా వినియోగించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన సూచించినట్లు సమాచారం.
శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని ముందుగా ఎంతమంది మంత్రులు ఇన్‌స్టాగ్రామ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారో అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రతి మంత్రి తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను చురుకుగా నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడమే కాకుండా, యువతను ఆకట్టుకునే విధంగా రీల్స్, షార్ట్ వీడియోలు, ప్రశ్నోత్తరాలు, ఇతర ఇంటరాక్టివ్ కంటెంట్‌ను రూపొందించాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కూడా సోషల్ మీడియాను సమర్థవంతమైన వేదికగా ఉపయోగించాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
ఈ సూచనలు చేసిన కొద్ది గంటల ముందే ప్రధాని మోదీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అర్ధరాత్రి సమయంలో ఓ షార్ట్ వీడియోను రీల్ రూపంలో పోస్టు చేశారు. "Friends" అనే పదంతో ప్రారంభమైన ఆ వీడియో ద్వారా యువతతో మరింత చేరువయ్యే కమ్యూనికేషన్ శైలిని ఆయన ప్రదర్శించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ కమ్యూనికేషన్‌కు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా భావిస్తున్నారు.




