PM Modi: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై పీఎం మోదీ సమీక్ష.. ఆర్థిక సలహా మండలితో కీలక భేటీ!
PM Modi: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడుదొడుకుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలితో శనివారం అత్యవసర భేటీ నిర్వహించారు.
PM Modi: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై పీఎం మోదీ సమీక్ష.. ఆర్థిక సలహా మండలితో కీలక భేటీ!
PM Modi: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ ముగింపుపై అనిశ్చితి ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రంగంలోకి దిగారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) సభ్యులతో ప్రధాని మోదీ శనివారం ఒక ఉన్నత స్థాయి కీలక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ భేటీలో పశ్చిమాసియా ఘర్షణల వల్ల భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న పరిణామాలపై ఆర్థిక నిపుణులు తమ అంచనాలను ప్రధానికి వివరించారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసు (Supply Chain) అంతరాయాలు, వాణిజ్య అనిశ్చితి వంటి బాహ్య ఒడుదొడుకులను తట్టుకునేలా భారత్‌ను ఎలా సన్నద్ధం చేయాలనే దానిపై మేధోమథనం సాగింది.
సమావేశంలో చర్చకు వచ్చిన ప్రధానాంశాలు:
ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఉన్నప్పటికీ, భారతదేశ స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటును మరింత వేగవంతం చేసే వ్యూహాలపై చర్చించారు.
విదేశీ మార్కెట్ల ఒత్తిడి దేశీయ మార్కెట్లపై పడకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడం.
'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (వ్యాపారాల నిర్వహణ సులభతరం), అలాగే 'ఈజ్ ఆఫ్ లివింగ్' (సాధారణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల) లక్ష్యంగా మరిన్ని ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి సమయాల్లోనూ భారతదేశం స్థిరమైన ప్రగతిని సాధించేందుకు అవసరమైన విధానపరమైన చర్యలు, ముందస్తు ప్రణాళికలపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో అధికారులకు, ఆర్థిక నిపుణులకు దిశానిర్దేశం చేశారు.




