PM Modi: బ్రిక్స్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచ సవాళ్లపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపు

PM Modi: ఢిల్లీలో జరుగుతున్న బహుపాక్షిక సదస్సులో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్‌ (BRICS) కూటమి పెరుగుతున్న ప్రాధాన్యం, ఆకర్షణపై కీలక వ్యాఖ్యలు

G Krishna
Published on: 13 Sept 2026 2:01 PM IST
PM Modi
X

PM Modi: బ్రిక్స్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచ సవాళ్లపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపు

PM Modi: ఢిల్లీలో జరుగుతున్న బహుపాక్షిక సదస్సులో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్‌ (BRICS) కూటమి పెరుగుతున్న ప్రాధాన్యం, ఆకర్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారం, పరస్పర మద్దతుతో అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఉమ్మడి లక్ష్యాలను సాధించవచ్చని చెప్పారు.

బ్రిక్స్‌పై పెరుగుతున్న నమ్మకానికి ఇదే నిదర్శనం

బ్రిక్స్‌లో కొత్తగా చేరుతున్న సభ్య దేశాలకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. వేర్వేరు ఖండాలు, సంస్కృతులు, అభివృద్ధి ప్రయాణాలను ఒకే వేదికపైకి తీసుకురావడం బ్రిక్స్ ప్రత్యేకత అని అన్నారు. కూటమిపై ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆకర్షణ, ప్రజల్లో ఏర్పడుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో నాలుగు ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిందని మోదీ తెలిపారు. లచీలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే నాలుగు స్తంభాల ఆధారంగా తమ కార్యాచరణ కొనసాగుతోందన్నారు. సభ్య దేశాల సహకారంతో ఉమ్మడి ఆలోచనలను అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

ఏ సంక్షోభం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు.. ఇవన్నీ పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో ఏ సంక్షోభం కూడా ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. ముప్పులను ముందుగానే గుర్తించడం, వాటికి సిద్ధంగా ఉండటం, అవసరమైన సమయంలో వేగంగా చర్యలు తీసుకోవడం కీలకమని చెప్పారు.

అంటువ్యాధులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ

అంటువ్యాధులను ముందుగానే గుర్తించి ఎదుర్కొనేందుకు బ్రిక్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏర్పాటుపై అంగీకారం కుదిరిందని మోదీ తెలిపారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల డేటా సమన్వయ మార్గదర్శకాలను కూడా రూపొందించినట్లు చెప్పారు. అలాగే బ్రిక్స్ లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థల సహకార ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రపంచ సరఫరా గొలుసులను మరింత విశ్వసనీయంగా, బలంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

పుతిన్, జిన్‌పింగ్‌తో కలిసి మోదీ

అంతకుముందు భారత్ మండపంలో బ్రిక్స్ దేశాల నేతలతో కలిసి ప్రధాని మోదీ ఫ్యామిలీ ఫొటోకు పోజులిచ్చారు. మోదీ మధ్యలో నిలబడగా ఆయన పక్కన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉన్నారు. సదస్సు చివరి భాగంలో భారత్‌ 2026 బ్రిక్స్ అధ్యక్షతకు సంబంధించిన నాలుగు ప్రధాన అంశాలు.. లచీలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతపై ప్రధానంగా చర్చ జరిగింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.