Paper Leak: పేపర్ లీక్ చేయాలనే ఆలోచన వస్తేనే దడ పుట్టాలి.. కఠిన సవరణ దిశగా కేంద్రం అడుగులు

Paper Leak: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో వరుసగా వెలుగుచూస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.

Mokshith
Published on: 24 July 2026 12:09 PM IST
Paper Leak
X

Paper Leak: పేపర్ లీక్ చేయాలనే ఆలోచన వస్తేనే దడ పుట్టాలి.. కఠిన సవరణ దిశగా కేంద్రం అడుగులు

Paper Leak: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో వరుసగా వెలుగుచూస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ ముఠాలను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక సవరణలను తీసుకురానున్నట్లు సమాచారం.

జైలు శిక్ష, భారీ జరిమానా.. మరింత కఠినం కానున్న నిబంధనలు

ప్రస్తుతం అమల్లో ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024 ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అక్రమాలకు పాల్పడిన వారికి 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే కొత్త సవరణలతో ఈ శిక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రతిపాదిత మార్పుల ప్రకారం పేపర్ లీక్‌లలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు లేదా సంఘటిత ముఠాలకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణలో పాల్గొనే ప్రైవేట్ సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే భారీ జరిమానాతో పాటు వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే నిబంధనలు చేర్చే అవకాశం ఉందని సమాచారం.

నాన్-బెయిలబుల్ కేసులు..

ప్రతిపాదిత చట్ట సవరణల్లో మరో కీలక అంశం నేరాలను నాన్-బెయిలబుల్ కేటగిరీలో చేర్చడం. దీంతో పేపర్ లీక్ కేసుల్లో అరెస్టయ్యే నిందితులకు సులభంగా బెయిల్ లభించే అవకాశం ఉండదు. దీంతో ఇలాంటి నేరాలకు పాల్పడేవారిలో భయం పెరిగి, లీకేజీలను అరికట్టడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

అదే సమయంలో ఈ చట్టం లక్ష్యం అక్రమాలకు పాల్పడే ముఠాలు, మధ్యవర్తులు, నిర్వాహకులపై చర్యలు తీసుకోవడమే తప్ప, ఎలాంటి సంబంధం లేని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన రక్షణ కల్పించే విధంగా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

నీట్ వివాదాల తర్వాత వేగం.. పార్లమెంట్‌లో త్వరలో బిల్లు

ఇటీవల నీట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనల తర్వాత పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడంతో ప్రభుత్వం చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరీక్షల అక్రమాలను సహించబోమని స్పష్టం చేశారు.

ప్రతిపాదిత సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత వచ్చే వారంలో సంబంధిత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పులపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక గెజిట్ లేదా తుది ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షల్లో పేపర్ లీక్‌లపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story