NTA Reforms: పేపర్ లీక్‌లకు శాశ్వత చెక్..ఒకేసారి 600 మంది పై వేటు.. కొత్త ఫార్ములాతో కేంద్రం

NTA Reforms: పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో తీవ్ర నిరాశకు గురైన విద్యార్థుల్లో నమ్మకాన్ని నింపేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి.

CR Reddy
Published on: 19 Aug 2026 7:24 AM IST
NTA Reforms
X

NTA Reforms

NTA Reforms: దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం బారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నీట్-యూజీ, యూజీసీ-నెట్ వివాదాల నేపథ్యంలో ఎన్‌టీఏలోని దాదాపు 600 మంది నిపుణులను ఒకేసారి తొలగించి, ఆ స్థానంలో కొత్త నిపుణులను నియమించడానికి వేగంగా చర్యలు చేపడుతోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పునరుద్ధరించేందుకు ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ విద్యాశాఖకు ఒక సమగ్ర నివేదికను అందజేశారు. పరీక్షల బృందాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించే పనిలో భాగంలో ఇప్పటికే 600 మంది నిపుణులకు గుడ్ బై చెప్పేశారు. వారి స్థానంలో కొత్త నిపుణులను ఎంపిక చేస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో మరో 20 నుంచి 25 మంది ఉన్నతాధికారులను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో మరింత మంది సమర్థులైన అధికారులను ఏజెన్సీలోకి తీసుకురావాలని విద్యాశాఖ యోచిస్తోంది.

నాలుగు అంచెల తనిఖీ వ్యవస్థ

ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఏమాత్రం లోపాలు రాకుండా ఉండేందుకు నాలుగు అంచెల తనిఖీ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నారు. ప్రశ్నపత్రాల్లో ఉండే టైపింగ్ పొరపాట్లు, అనువాద లోపాలు, వాస్తవపరమైన తప్పులను ఈ వ్యవస్థ పూర్తిగా అడ్డుకుంటుంది. దీనితో పాటు ఎన్‌టీఏ కార్యాలయాలను యుద్ధప్రాతిపదికన నూతన భవనాలకు తరలిస్తున్నారు. కొత్త కార్యాలయాల వద్ద భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) బలగాలను మోహరిస్తున్నారు. పేపర్ల ముద్రణ, రవాణా, భద్రత అంతా ఇకపై బలగాల నిఘా నీడలోనే సాగనుంది.

యూజీసీ-నెట్ పరీక్షల పునఃనిర్వహణ

ఇటీవల జరిగిన యూజీసీ-నెట్ జూన్ 2026 పరీక్షలకు సంబంధించి ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల పేపర్లలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. దీంతో ఆ మూడు సబ్జెక్టుల పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 47 మంది ఎన్‌టీఏ అధికారుల సేవలపై జూలై నెలలోనే ప్రభుత్వం వేటు వేసింది. తాజాగా మరో 600 మంది నిపుణుల తొలగింపుతో ఎన్‌టీఏను మూలాల నుంచి ప్రక్షాళన చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పేపర్ లీక్ చేస్తే కఠిన శిక్షలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రల్హాద్ జోషి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పరీక్షల భద్రతపై కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేలా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026'ను పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. పేపర్ లీకేజీలకు పాల్పడితే కోట్లాది రూపాయల జరిమానాతో పాటు కఠిన జైలు శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసేలా ఈ చట్టంలో కఠిన నిబంధనలను చేర్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story