PM Modi: నార్వే చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద.. చరిత్ర సృష్టించిన భారత కుర్రాడిపై మోదీ ప్రశంసలు!
PM Modi: ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్‌ను గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద (Praggnanandhaa) సరికొత్త చరిత్ర సృష్టించాడు.
PM Modi: నార్వే చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద.. చరిత్ర సృష్టించిన భారత కుర్రాడిపై మోదీ ప్రశంసలు!
PM Modi: భారత యువ గ్రాండ్‌మాస్టర్, 20 ఏళ్ల ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'నార్వే చెస్ టోర్నీ' టైటిల్‌ను సొంతం చేసుకున్న మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెరీర్లో కేవలం రెండోసారి మాత్రమే ఈ టోర్నీ ఆడుతున్న ప్రజ్ఞానంద.. అసాధారణ ప్రదర్శనతో టైటిల్ ముద్దాడటంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ప్రజ్ఞానంద సాధించిన అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా స్పందించారు. "ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభకు ఇదో కీలక మైలురాయి. అతని ఆటతీరు దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, ఎన్నో విజయాలు సాధించాలి" అని పీఎం మోదీ ఆకాంక్షించారు.
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సైతం యువ గ్రాండ్‌మాస్టర్‌ను అభినందించారు. "ఈ అద్భుతమైన విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభకు, అచంచలమైన అంకితభావానికి, ఏళ్ల తరబడి చేసిన కృషికి నిదర్శనం. ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశాడు. ప్రజ్ఞానంద విజయం దేశంలోని ఎందరో యువ చెస్ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది" అని ప్రశంసించారు.
ఈ టోర్నీలో ప్రజ్ఞానంద ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. ఏడుసార్లు నార్వే చెస్ టోర్నీ విజేతగా, ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్‌గా ఉన్న మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఈ సింగిల్ టోర్నీలోనే ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. టోర్నీ ప్రారంభంలో తొలి ఆరు రౌండ్లలో మూడింట్లో ఓటమిపాలైనప్పటికీ.. మానసిక ధైర్యం కోల్పోకుండా అద్భుతంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు రౌండ్లలో అప్రతిహత విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
మరోవైపు ఈ టోర్నీలో భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ డి. గుకేశ్‌కు నిరాశే ఎదురైంది. ఆఖరి రౌండ్లో గుకేశ్ తీవ్రంగా పోరాడినప్పటికీ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో గుకేశ్ మొత్తం 8 పాయింట్లతో టోర్నీలో చివరి స్థానానికి పరిమితమయ్యాడు. అయినప్పటికీ, ప్రజ్ఞానంద చారిత్రాత్మక విజయంతో నార్వే చెస్ టోర్నీలో భారత జెండా ఎగిరింది.




