మళ్లీ లాక్‌డౌన్? పెట్రోల్, డీజిల్ కష్టాలపై కేంద్రం కీలక ప్రకటన!

Lockdown Rumours: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందించారు.

Arun Chilukuri
Published on: 27 March 2026 11:39 AM IST
మళ్లీ లాక్‌డౌన్? పెట్రోల్, డీజిల్ కష్టాలపై కేంద్రం కీలక ప్రకటన!
X

మళ్లీ లాక్‌డౌన్? పెట్రోల్, డీజిల్ కష్టాలపై కేంద్రం కీలక ప్రకటన!

Lockdown Rumours: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న 'లాక్‌డౌన్' వదంతులను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.

వదంతులు నమ్మొద్దు.. అంతా సిద్ధం:

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాహనదారులు బంకుల వద్ద క్యూ కడుతుండటంపై మంత్రి స్పందిస్తూ.. "లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. అలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదు. అంతర్జాతీయంగా చమురు ధరల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం ఎనర్జీ సప్లై చైన్‌ను నిరంతరం సమీక్షిస్తోంది. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం" అని వరుస ట్వీట్ల ద్వారా స్పష్టం చేశారు.

ఇంధన ఎగుమతులపై పన్ను విధింపు:

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 122 డాలర్ల వరకు పెరిగినప్పటికీ, దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు..విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరుకు రూ.21.5 చొప్పున పన్ను విధించారు. విమాన ఇంధనంపై లీటరుకు రూ.29.5 మేర పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుంచి రూ.3కు తగ్గించగా, డీజిల్‌పై ఉన్న రూ.10 సుంకాన్ని పూర్తిగా తొలగించారు.

ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల.. భారత్ మినహాయింపు:

అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగినా, మన దేశంలో వినియోగదారుల ప్రయోజనం దృష్ట్యా పన్ను ఆదాయాన్ని తగ్గించుకుని మరీ ధరలను నియంత్రణలో ఉంచామని పురీ పేర్కొన్నారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉండాలని, గందరగోళానికి గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story