NIA Arrest : దేశరహస్యాలను అమ్మేసిన పాక్ గూఢచారి.. ఎన్‌ఐఏ వలలో చిక్కిన కోల్‌కతా కేటుగాడు

NIA Arrest : పాకిస్తాన్‌కు భారత రక్షణ రహస్యాలను చేరవేస్తున్న కోల్‌కతాకు చెందిన గూఢచారి జాఫర్ రియాజ్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. భారత నంబర్ల ఓటీపీలను పాక్ అధికారులకు లీక్ చేసినట్లు గుర్తించారు.

CR Reddy
Published on: 21 May 2026 8:34 AM IST
NIA Arrest
X

NIA Arrest  

NIA Arrest : భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఒక ప్రమాదకరమైన గూఢచారిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పాక్ మద్దతుతో నడుస్తున్న ఈ అంతర్జాతీయ స్పైయింగ్ రాకెట్ గుట్టును ఎన్‌ఐఏ రట్టు చేసింది. నిందితుడు భారత దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా, ఇక్కడి ఆర్మీ స్థావరాల సమాచారాన్ని గుఢాచారిగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) అప్పగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్లాన్‌తో దాడి చేసి ఈ దేశద్రోహిని కటకటాల్లోకి నెట్టారు.

కోల్‌కతా టు పాకిస్తాన్..

ఎన్‌ఐఏ పట్టుకున్న ఈ పాక్ ఏజెంట్ పేరు జాఫర్ రియాజ్ అలియాస్ రిజ్వీ. ఈయన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నివాసి. ఈ కేటుగాడిపై గతంలోనే నిఘా వర్గాలు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశాయి. అంతేకాకుండా, కోర్టు ద్వారా అతడిని నేరస్థుడిగా ప్రకటించే ప్రక్రియ జరుగుతున్న తరుణంలోనే ఎన్‌ఐఏ బృందం ఇతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో ఈ జుగుప్సాకరమైన దేశద్రోహి ఒక పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నాడని, అతని పిల్లలు కూడా పాక్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని తేలింది.

20 ఏళ్లుగా పాక్ యాత్రలు.. పౌరసత్వం, పైసల ఆశ చూపి వల

ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసు (RC-12/2025/NIA/DLI) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు జాఫర్ రియాజ్ గత 2005 సంవత్సరం నుంచి నిరంతరాయంగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాడు. ఇలాంటి ఒక ప్రయాణంలోనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇతనికి గాలం వేశారు. భారీగా డబ్బులు ఇస్తామని, అలాగే పాకిస్తాన్ పౌరసత్వం ఇప్పిస్తామని ఆశ చూపించడంతో.. జాఫర్ దేశద్రోహానికి ఒడిగట్టాడు. గతంలో కూడా ఇతగాడు ఐపీసీ, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఇరకబడి జైలు శిక్ష అనుభవించడం గమనార్హం. జైలు నుంచి వచ్చినా ఇతని బుద్ధి మారలేదు.

భారతీయ నంబర్ల ఓటీపీలు పాకిస్తాన్‌కు

ఈ గూఢచారి అనుసరించిన సరికొత్త టెక్నాలజీ మోసం దేశ రక్షణ సంస్థలను ఆశ్చర్యపరిచింది. భారత సైనిక బలగాల కదలికలను తెలుసుకోవడానికి, ఇక్కడి అనుమానాస్పద వ్యక్తులతో చాటింగ్ చేయడానికి వీలుగా జాఫర్ రియాజ్ కొన్ని భారతీయ మొబైల్ నంబర్లను కొనుగోలు చేశాడు. వాటికి వచ్చే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హ్యాండ్లర్లకు చేరవేశాడు. ఈ ఓటీపీల సాయంతో పాక్ అధికారులు ఆయా నంబర్లపై దొంగతనంగా వాట్సాప్ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నారు.

మోతీరామ్ జాట్‌తో పాక్ హ్యాండ్లర్ల చాటింగ్

భారతీయ నంబర్లతో ఓపెన్ చేసిన ఆ వాట్సాప్ అకౌంట్ల ద్వారా పాక్ నిఘా అధికారులు ఇక్కడ మోతీరామ్ జాట్ అనే మరో నిందితుడితో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఈ మోతీరామ్ జాట్ కూడా ఆర్మీ రక్షణ రహస్యాలను సేకరించి పాకిస్తాన్‌కు పంపే నెట్‌వర్క్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత ఆర్మీ అంతర్గత విషయాలను ఈ నకిలీ వాట్సాప్ గ్రూపుల ద్వారా చేరవేసేవారని ఎన్‌ఐఏ నిర్ధారించింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? కోల్‌కతా నుండి రాజస్థాన్ సరిహద్దుల వరకు ఎవరైనా సహాయం చేశారా? అనే కోణంలో ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story