NEET UG 2026 Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్ బంద్..
NEET UG 2026 Re-Exam: నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NEET UG 2026 Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం: టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్ బంద్..
NEET UG 2026 Re-Exam: ఈ నెల 21న దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందస్తు చర్యలు చేపట్టింది. పరీక్షల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, పేపర్ లీకేజీ పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ పరీక్షల సంస్థ (NTA) సూచనల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఈ ఉత్తర్వులు ఇచ్చింది. టెలిగ్రామ్‌లో “PAPER LEAKED NEET”, “Re-NEET 2026”, “Private Mafia” వంటి పేర్లతో గ్రూపులు క్రియేట్ చేసి, విద్యార్థులను మోసం చేస్తున్న పలు ఛానళ్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఒరిజినల్ ప్రశ్నపత్రాలు తమ వద్దే ఉన్నాయంటూ నమ్మించి, అభ్యర్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ఛానల్‌ను డిలీట్ చేయడం వల్ల సమస్య తీరడం లేదని, అందుకే 'మెసేజ్ ఎడిట్' ఆప్షన్‌ను బ్లాక్ చేయడం ద్వారా మోసగాళ్ల నెట్‌వర్క్‌లను అడ్డుకోవచ్చని NTA ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ నీట్ మోసాలకు సంబంధించి అహ్మదాబాద్‌లో ఇప్పటికే ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది టెలిగ్రామ్ ఛానెళ్లు నడుపుతూ దాదాపు రూ. 1.5 కోట్లు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బిహార్ పోలీస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (EOU) కూడా అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది.
నీట్-యూజీ ప్రశ్నపత్రాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), ఐటీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఈ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడడానికే టెలిగ్రామ్‌పై ఈ తాత్కాలిక పరిమితులు విధించాల్సి వచ్చిందని, దీనివల్ల సాధారణ వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి ఎన్‌టీఏ (NTA) విచారం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచించారు. ఎవరైనా లీకేజీల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ‘1930’ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది.




