PM Modi  : మోదీ మరో సెల్ఫీ వీడియో.. తనను బూతులు తిట్టిన వాళ్లకు ప్రధాని పంచ్

PM Modi  : నీట్ పేపర్ లీక్ నిరసనల్లో తనను, తన తల్లిని అసభ్యంగా దూషించిన యువతపై ప్రధాని మోదీ స్పందించారు.

CR Reddy
Published on: 1 Aug 2026 7:19 AM IST
PM Modi
X

PM Modi

PM Modi : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెల రోజులుగా నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో కొందరు యువతీయువకులు నిరసనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనల మధ్య రుచికా సింగ్ అనే యువతితో పాటు మరికొందరు యువకులు.. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అలాగే మరణించిన ఆయన కన్నతల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. సదరు యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వెల్లువెత్తాయి.

నా తల్లిని కూడా వదల్లేదు.. మోదీ భావోద్వేగం

తనపై, తన తల్లిపై జరిగిన ఈ తీవ్రమైన ట్రోలింగ్, బూతుల పర్వంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ భరితమైన వీడియోను పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో దేశంతో పాటు ప్రపంచం మొత్తం చూసింది. కొందరు అల్లరి పిల్లలు అత్యంత దారుణంగా మాట్లాడారు. నాగరిక సమాజం సిగ్గుపడేలా నా పట్ల, చనిపోయిన నా తల్లి పట్ల దారుణమైన బూతులు వాడారు. మన ఆడబిడ్డలు ఇంతలా దిగజారిపోయి మాట్లాడటం చూస్తే నా మనసుకు ఎంతో బాధ కలిగింది" అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు.

పళ్లు నాలుకను కరిస్తే పీకేస్తామా?

తప్పు చేసిన వాళ్లపై ప్రధాని మోదీ ఫైర్ అవుతారని, అరెస్టులు చేయిస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన గొప్ప మనసు చాటుకున్నారు. "బాల్యంలో తప్పులు చేయడం సహజం, వాటిని దిద్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి. వాళ్లంతా దారితప్పిన పిల్లలు. వాళ్లకు సరైన దారి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. వాళ్లకు శిక్షలు వేసి, కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ల జీవితాలు నాశనం చేయాలని నేను అనుకోవడం లేదు. నేను వాళ్లను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. సమాజం కూడా నా నిర్ణయాన్ని అంగీకరించాలి. ఎందుకంటే, మన పళ్లు పొరపాటున మన నాలుకను కరిస్తే రక్తం వస్తుంది.. అంతమాత్రాన పీకేయం కదా. పళ్లు మనవే, నాలుక మనదే.. ఆ పిల్లలు కూడా మనవాళ్లే" అంటూ మోదీ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


కలిసికట్టుగా అడుగులు వేద్దాం

దారితప్పిన యువతకు సరైన మార్గదర్శనం చేయడం చాలా కష్టమైన పనే అయినా.. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రధాని స్పష్టం చేశారు. "పిల్లలూ.. రండి, దేశం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. చేసిన తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుందాం. మీ కలలను సాకారం చేసుకునే దిశగా కొత్త ప్రయాణం మొదలుపెట్టండి. నేను బ్రతుకుతున్నదే మీకోసం, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం. మనమంతా కలిసి దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం" అంటూ మోదీ తన వీడియో సందేశాన్ని ముగించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story