NEET Paper Leak Protest: ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన బాలికపై కేసు ఎత్తివేత.. క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు!

NEET Paper Leak Protest: నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల మైనర్ బాలికపై కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 11:02 AM IST
NEET Paper Leak Protest
X

NEET Paper Leak Protest: ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన బాలికపై కేసు ఎత్తివేత.. క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు!

NEET Paper Leak Protest: నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక విషయంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమెపై నమోదు చేసిన కేసును ముందుకు తీసుకెళ్లబోమని, కేసును కొనసాగించడం లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

జులైలో జరిగిన నిరసనల్లో ప్రధాని పదవిని అగౌరవపరిచేలా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా సదరు బాలిక మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అందిన ఫిర్యాదు ఆధారంగా నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో పోలీసులు "జీరో ఎఫ్‌ఐఆర్" నమోదు చేశారు. ఘటన ఢిల్లీ పరిధిలో జరగడంతో ఆ కేసును విచారణ నిమిత్తం దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

తొలుత నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు సదరు యువతి వయస్సును 25 ఏళ్లుగా పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె వయస్సు 25 ఏళ్లు కాదని, ఆమె కేవలం 15 ఏళ్ల మైనర్ (10వ తరగతి విద్యార్థిని) అని బాలిక తల్లి వెల్లడించారు. పొరపాటున ఇతరుల ఉసిగొల్పుతోనే తన కుమార్తె ఆ వ్యాఖ్యలు చేసిందని, విచారణ లేకుండా కేసు పెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు.

సదరు బాలిక మరియు ఆమె తల్లి తమ తప్పును తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. మైనర్ చిన్నారిని క్షమించి కేసును ముందుకు తీసుకెళ్లకూడదని భావించిన ప్రధాని మోదీ గొప్ప మనసును ఆమె కొనియాడారు. ఇదే క్రమంలో 18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలని బాలిక తల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిన్న వయసులో పిల్లలు ఇతరుల ప్రభావానికి లోనై దారి తప్పే ప్రమాదం ఉందని, వారి దృష్టి కేవలం చదువులపైనే ఉండేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story