Indian Prisons : దేశంలో జైళ్లన్నీ హౌస్ ఫుల్.. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం షాకింగ్ లెక్కలు

Indian Prisons : భారత జైళ్లలో సామర్థ్యం కంటే 112% అదనంగా ఖైదీలు ఉన్నారు. ఢిల్లీ జైళ్లు 194.6% ఉపయోగంతో అత్యంత రద్దీగా ఉన్నాయని పార్లమెంట్‌లో కేంద్రం నివేదించింది.

CR Reddy
Published on: 6 Aug 2026 6:51 AM IST
Indian Prisons
X

Indian Prisons

Indian Prisons : భారతదేశంలోని కారాగారాల్లో ఖైదీల రద్దీ రోజురోజుకూ పెరిగిపోతూ పెద్ద సవాలుగా మారుతోంది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2024 గణాంకాల ప్రకారం.. దేశంలోని జైళ్లు తమ నిర్దేశిత సామర్థ్యం కంటే 112.7 శాతం ఎక్కువగా నిండిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 609 జైళ్లలో పరిమితికి మించి ఖైదీలు మగ్గుతున్నారు. ఇందులో దేశ రాజధాని ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యంత రద్దీ కలిగిన ప్రాంతంగా నిలిచింది. అక్కడ జైళ్ల సామర్థ్యానికి మించి ఏకంగా 194.6 శాతం మేర ఖైదీలు ఉన్నారు.

రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వివరాలను అందించారు. డిసెంబర్ 31, 2024 నాటికి దేశంలోని అన్ని జైళ్ల మొత్తం సామర్థ్యం 4,53,769 మంది ఖైదీలు మాత్రమే కాగా, ఆ సమయానికి జైళ్లలో ఏకంగా 5,11,542 మంది ఖైదీలు ఉన్నారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా జైళ్లలో 57,773 మంది ఖైదీలు సామర్థ్యానికి మించి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఢిల్లీ జైళ్లలో 10,026 మంది సామర్థ్యం మాత్రమే ఉండగా, అక్కడ 19,512 మంది ఖైదీలు ఉన్నారని, దీంతో ఆక్యుపెన్సీ రేటు 194.6 శాతానికి చేరిందని తెలిపారు.

ఏ రాష్ట్రంలో ఎంతమంది ఖైదీలు ఉన్నారంటే?

ఢిల్లీ తర్వాత అత్యంత రద్దీ ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది:

* మేఘాలయ: 860 మంది సామర్థ్యానికి గాను 1,406 మంది ఖైదీలు ఉన్నారు (163.5%).

* జమ్మూ & కాశ్మీర్: 3,629 మంది సామర్థ్యానికి గాను 5,383 మంది ఉన్నారు (148.3%).

* మధ్యప్రదేశ్: 30,644 మంది సామర్థ్యానికి గాను 45,092 మంది ఉన్నారు (147.1%).

* మహారాష్ట్ర: 27,110 మంది సామర్థ్యానికి గాను 39,003 మంది ఉన్నారు (143.9%).

* కేరళ: 7,823 మంది సామర్థ్యానికి గాను 10,307 మంది ఉన్నారు (131.8%).

* పంజాబ్: 26,543 మంది సామర్థ్యానికి గాను 30,663 మంది ఖైదీలు ఉన్నారు (115.5%).

దేశంలోనే అత్యధిక జైలు సామర్థ్యం కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 76,162 మందిని ఉంచే వెసులుబాటు ఉండగా, అక్కడ 86,762 మంది ఖైదీలు ఉన్నారు. దీంతో అక్కడ జైళ్ల వినియోగ రేటు 113.9 శాతంగా నమోదైంది. మరో ప్రశ్నకు సమాధానంగా, డిసెంబర్ 31, 2024 నాటికి దేశంలో 3,71,440 మంది విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు జైళ్లలో ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో 968 మంది బిఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 479 లేదా సిఆర్‌పిసి సెక్షన్ 436ఎ కింద విడుదలయ్యే అర్హత సాధించినప్పటికీ, 2024లో కేవలం 627 మందిని మాత్రమే విడుదల చేయగలిగారు.

ఖైదీల నిర్వహణ, జైళ్ల విస్తరణ, అర్హులైన విచారణ ఖైదీల సమయానికి విడుదల వంటి విషయాలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలోని అంశాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే జైళ్ల ఆధునీకరణ కోసం గత ఐదేళ్లలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.608.6 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ నిధులతో హై-సెక్యూరిటీ జైళ్ల నిర్మాణం, భద్రతా వ్యవస్థ పటిష్టం చేయడం, ఖైదీల పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. జైళ్లలో మానవతా దృక్పథం, వైద్య సదుపాయాలు, న్యాయ సహాయాన్ని మెరుగుపరచడానికి మోడల్ ప్రిజన్ మాన్యువల్-2016ను పాటించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story