Child Safety : ఇన్స్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకర ప్రకటనలా?.. మెటా సంస్థపై సుమోటో కేసు
Child Safety : మెటా ప్లాట్‌ఫారమ్‌లలో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ప్రకటనల వివాదంపై NCPCR, NHRC తీవ్ర విచారణను ప్రారంభించాయి
Meta
Child Safety : సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌లపై పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రకటనల రూపంలో దర్శనమిస్తుందన్న ఆరోపణలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను ప్రారంభించింది. బిబిసి ఐ ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకుని జూలై 3న మెటాకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందిస్తూ మెటా ఒక వారంలో వివరణ ఇచ్చినప్పటికీ, అందులోని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాలని ఎన్‌సిపిసిఆర్ నిర్ణయించింది.
ఢిల్లీ పోలీసులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు
ఈ వ్యవహారంలో కేవలం ఎన్‌సిపిసిఆర్ మాత్రమే కాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా తీవ్రంగా పరిగణించింది. ఇన్స్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ యాడ్స్ ద్వారా చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌ను ప్రోత్సహించడంపై సమగ్ర విచారణ జరిపాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. పోక్సో చట్టం ప్రకారం ఇటువంటి నేరపూరిత విషయాన్ని దాచిపెట్టడం లేదా నివేదించకపోవడం నేరమవుతుందని, సాంకేతిక సంస్థ అయిన మెటా లేదా ఇతర సంబంధిత సంస్థలు తమ బాధ్యతలను నెరవేర్చాయో లేదో తేల్చాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో జూలై 8, జూలై 29 తేదీల్లో ఢిల్లీ పోలీసులకు లేఖలు రాస్తూ పూర్తి వివరాలతో కూడిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశించింది.
భారత్‌కు రానున్న మెటా గ్లోబల్ టీమ్
కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కూడా ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 5, 6 తేదీల్లో భారత్ సందర్శించనున్న మెటా ఉన్నత స్థాయి గ్లోబల్ బృందంతో నిర్వహించే సమావేశంలో ఈ అంశాలను ప్రధానంగా లేవనెత్తనున్నారు. చైల్డ్ అబ్యూజ్డ్ కంటెంట్‌ను అరికట్టడంలో కంపెనీ విఫలమవడం, ప్రధాన వెరిఫైడ్ ఖాతాలపై తాత్కాలిక నిషేధాలు విధించడం, ఏఐ ద్వారా రూపొందే ప్రమాదకర కంటెంట్ నియంత్రణపై కేంద్రీకృత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనే భారత పర్యటన బృందంలో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, మెటా సిఈఓ మార్క్ జుకర్‌బెర్గ్ స్వయంగా ఈ దారుణమైన నిర్లక్ష్యానికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
డిజిటల్ భద్రతపై భారత్ కఠిన వైఖరి
సమాజంలో చిన్నారుల భద్రతకు ముప్పు వాటిల్లేలా సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వ్యవహరిస్తే ఎంతటి పెద్ద కంపెనీపైనైనా కఠిన చర్యలు ఉంటాయని ఈ విచారణల ద్వారా భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కేవలం వ్యాపార ప్రకటనల లాభాల కోసం పిల్లల హక్కులను, భద్రతను పణంగా పెడితే చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ విచారణ నివేదికల ఆధారంగా రాబోయే రోజుల్లో మెటా సంస్థపై కఠినమైన ఆంక్షలు లేదా భారీ జరిమానాలు విధించే అవకాశం కనిపిస్తోంది.




