Viral Video: టీకా తీసుకున్న కొద్ది నిమిషాలకే రోడ్డుపై కుప్పకూలిన 17 ఏళ్ల బాలిక.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు!

Viral Video: మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. టెటానస్–డిఫ్తీరియా (Td) బూస్టర్ టీకా తీసుకున్న 17 ఏళ్ల బాలిక కొద్ది నిమిషాల్లోనే రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 12:46 PM IST
Viral Video
X

Viral Video: టీకా తీసుకున్న కొద్ది నిమిషాలకే రోడ్డుపై కుప్పకూలిన 17 ఏళ్ల బాలిక.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు!

Viral Video: రోగాల నుంచి రక్షణ కల్పించాల్సిన టీకా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుందా..? మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఒక అనూహ్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో టీకా తీసుకున్న 17 ఏళ్ల బాలిక.. బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకే అస్వస్థతకు గురై నడిరోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగింది..?

నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాధారణ రోగనిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 17 ఏళ్ల బాలికకు టెటానస్–డిఫ్తీరియా (Td) బూస్టర్ టీకా ఇచ్చారు. మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో టీకా తీసుకున్న అనంతరం ఆమె నిబంధనల ప్రకారం కొద్దిసేపు వైద్యుల పరిశీలనలో ఉండి బయటకు వచ్చింది.

ఆ తర్వాత సమీపంలోని మెడికల్ షాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్లిన ఆమె.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తనకి తల తిరుగుతోందని చుట్టుపక్కల వారితో చెప్పిన కొద్ది క్షణాల్లోనే స్పృహ తప్పి రోడ్డుపై కుప్పకూలింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్రంగా గాయమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. సీసీటీవీ వీడియోలో బాలిక సాధారణంగా నడుచుకుంటూ వచ్చి, ఒక్కసారిగా తూలి కిందపడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

మరణానికి కారణం టీకానేనా..? అధికారులు ఏమంటున్నారు?

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టీకా వికటించడం వల్లే బాలిక చనిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, ఆరోగ్య శాఖ అధికారులు ఈ వదంతులను ఖండించారు. టీకా వల్లే మరణం సంభవించిందని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

ఈ మరణం వెనుక పలు కోణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు:

ఇది టీకా వల్ల వచ్చిన అత్యంత అరుదైన ప్రతికూల రియాక్షనా?

లేక బాలికకు ముందుగానే ఏదైనా గుండె సంబంధిత లేదా ఇతర అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉన్నాయా?

కిందపడినప్పుడు తలకు తగిలిన బలమైన గాయం వల్లే ప్రాణాలు కోల్పోయిందా?

ఈ కోణాల్లో పూర్తి స్థాయి వైద్య, ఫోరెన్సిక్ మరియు శాస్త్రీయ దర్యాప్తు నిర్వహించిన అనంతరమే మరణానికి గల అసలు కారణం వెల్లడవుతుందని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story