Mumbai Woman: నోరు మూసుకో.. గెట్ అవుట్ అంటూ మంత్రిపై విరుచుకుపడ్డ మహిళ
Mumbai Woman: ముంబైలో రాజకీయ ర్యాలీ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌పై ఒక సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Mumbai Woman: నోరు మూసుకో.. గెట్ అవుట్ అంటూ మంత్రిపై విరుచుకుపడ్డ మహిళ
Minister Girish Mahajan: రాజకీయ పార్టీల ర్యాలీలు అంటేనే ట్రాఫిక్ ఆంక్షలు, కిలోమీటర్ల మేర నిలిచిపోయే వాహనాలు. తాజాగా ముంబైలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాల తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ముంబైలోని జంబోరీ మైదాన్ ప్రాంతంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీ వల్ల సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఆమె ఓపిక నశించింది
సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ తన బిడ్డను స్కూల్ నుండి ఇంటికి తీసుకురావడానికి వెళ్తోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. తన వాహనం దిగి నేరుగా ర్యాలీలో ఉన్న మంత్రి గిరీష్ మహాజన్ వద్దకు దూసుకెళ్లింది. చుట్టూ పోలీసులు, వందలాది మంది కార్యకర్తలు ఉన్నా ఆమె ఏమాత్రం బెదరలేదు.
గేట్ అవుట్
మంత్రిని నిలదీస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పక్కనే ఖాళీ మైదానం ఉంది.. అక్కడికి వెళ్లి నిరసన చేసుకోవచ్చు కదా? రోడ్డు మీద ర్యాలీలు చేస్తూ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, మా ఇబ్బందులు మీకు పట్టవా? అంటూ వారిపై కూడా విరుచుకుపడింది. మంత్రి గిరీష్ మహాజన్ ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ప్రశంసల జల్లు
సామాన్యుల గళాన్ని వినిపించిన ఈ మహిళ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం సామాన్య ప్రజల ప్రాథమిక హక్కులను, సమయాన్ని వృథా చేయడం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే వారు ఇలాంటి ర్యాలీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ ఘటన మరోసారి నిరూపించింది.ప్రస్తుతం ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా షేర్ అవుతోంది. సామాన్యుల అసహనం కట్టలు తెంచుకుంటే రాజకీయ నాయకులకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఈ ఘటన ఒక సాక్ష్యంగా నిలిచింది.




