బావిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీళ్లు.. మోర్బీలో వింత ఘటన కలకలం!

Gujarat: గుజరాత్‌లోని మోర్బీ జిల్లా విర్పర్ద గ్రామంలో బావిలోని నీరు వింతగా ఉవ్వెత్తున ఎగసిపడుతుండటం కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 7 Aug 2026 11:02 AM IST
gujarat
X

బావిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీళ్లు.. మోర్బీలో వింత ఘటన కలకలం!

Gujarat: గుజరాత్‌లోని మోర్బీ జిల్లా విర్పర్ద గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో కొన్ని రోజులుగా నీళ్లు వాటంతట అవే ఉవ్వెత్తున ఎగసిపడుతూ, అలల మాదిరిగా కదులుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ పరిణామంపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది భూకంప సంబంధిత చర్య కాదని అధికారులు ప్రాథమికంగా స్పష్టం చేశారు.

విర్పర్ద గ్రామానికి చెందిన ప్రాంజీవన్ సదరియా అనే రైతు పొలంలో ఉన్న 18 అడుగుల లోతు బావిలో ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ వింత కదలికలు మొదలయ్యాయి. నీళ్లు నిరంతరం అలల మాదిరిగా ఉప్పొంగుతూ బావి అంచుల నుంచి బయటకు వస్తుండటంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ఈ ఘటనపై జిల్లా జియాలజిస్ట్ జే.ఎస్. వాధేర్ స్పందిస్తూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు వేగంగా నిండాయని తెలిపారు. రాళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో చిక్కుకున్న గాలి, నీటి ఒత్తిడికి బయటకు విడుదల కావడం వల్లే బావిలోని నీరు ఇలా ఎగసిపడుతోందని వివరించారు.

గాంధీనగర్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్’ కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి భూకంప ఫాల్ట్ లైన్ లేదని స్పష్టం చేసింది. మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే మాట్లాడుతూ.. నిపుణుల బృందం త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి పూర్తి కారణాలు వెల్లడిస్తుందని తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story