Narendra Modi : మోదీ మాస్టర్ ప్లాన్.. ‘సుదర్శన చక్రం’తో భారత్‌కు తిరుగులేని రక్షణ.!
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను
PM-MOdi
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమకాలీన భద్రతా సవాళ్లు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత సద్ధతను మరింత బలోపేతం చేసేలా ఒక భారీ, ఆధునిక ‘సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ఫోర్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనితో పాటు రాబోయే రోజుల్లో రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆధునిక సవాళ్లకు చెక్.. సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్
మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త రకం సైబర్, వ్యూహాత్మక , అంతర్గత ముప్పుల నుంచి పౌరులను కాపాడుకోవడానికి ఆధునిక వ్యవస్థలతో కూడిన వాలంటీర్ నెట్‌వర్క్ అవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఒక క్రియాశీలక సివిల్ డిఫెన్స్ వ్యవస్థను నెలకొల్పి, అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించేలా వాలంటీర్లకు ఆధునిక సాంకేతికతలతో శిక్షణ ఇస్తామన్నారు. సాంప్రదాయ అత్యవసర పరిస్థితులే కాకుండా ఆధునిక సవాళ్లను అధిగమించగల సమర్థవంతమైన బలగాన్ని తయారు చేయడం ద్వారా పౌరులకు ముందస్తు హెచ్చరికలు, అత్యవసర కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణలో నిరంతర శిక్షణ లభిస్తుందని తెలిపారు.
శరవేగంగా 'సుదర్శన చక్ర' ఎయిర్ డిఫెన్స్ పనులు
దేశీయంగా ఆత్మనిర్భరత సాధించడంలో భాగమైన ఎయిర్ డిఫెన్స్ క్షేత్రంపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా 'సుదర్శన చక్ర' ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనులు అత్యంత వేగంగా పురోగతి సాధిస్తున్నాయని వెల్లడించారు. కీలకమైన మిలిటరీ , పౌర సంబంధిత నిర్మాణాలపై వైమానిక దాడులు జరగకుండా రక్షణ కల్పించడం, శత్రుమూకల వైమానిక దాడులను తక్షణమే తిప్పికొట్టడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా భారత్.. పెరుగుతున్న రక్షణ ఎగుమతులు
రక్షణ రంగంలో కేవలం స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా, ప్రపంచ దేశాలకు సైనిక పరిజ్ఞానాన్ని, ఆయుధాలను సరఫరా చేసే ప్రధాన స్థాయికి భారత్ ఎదగాలని ప్రధాని పిలుపునిచ్చారు. రాబోయే కాలపు యుద్ధాల్లో కీలక పాత్ర పోషించనున్న డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, హైపర్ సోనిక్ టెక్నాలజీలపై భారత్ స్వయంప్రతిపత్తి సాధించాల్సి ఉందన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ రూ. 1.78 లక్షల కోట్లకు చేరడంతో పాటు, భారత రక్షణ ఎగుమతులు రూ. 38,424 కోట్లకు పెరిగి దాదాపు 100 దేశాలకు భారత ఆయుధాలు, సాంకేతికత సరఫరా కావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
జాతీయ భద్రతలో నారీ శక్తి ప్రాధాన్యత
దేశాభివృద్ధి , భద్రతలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఫైటర్ ఏవియేషన్, సివిల్ ఏవియేషన్, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలతో పాటు సాయుధ బలగాల్లో భారతీయ మహిళలు సాధిస్తున్న విజయాలు అభినందనీయమన్నారు. జాతీయ భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ, రక్షణ రంగంలో ఎగుమతుల పెంపుదల , పౌర భద్రత లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.




