Modi Cabinet Reshuffle: కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు.. తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త మంత్రులు వీరే?

Modi Cabinet Reshuffle: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 24 Jun 2026 10:50 AM IST
Modi Cabinet Reshuffle
X

Modi Cabinet Reshuffle: కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు.. తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త మంత్రులు వీరే?

Modi Cabinet Reshuffle: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడో ప్రభుత్వం (Modi 3.0) రెండేళ్లు పూర్తి చేసుకున్న వేళ.. కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు చేర్పులకు కసరత్తు ఊపందుకుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పనితీరు సరిగ్గా లేని, అలాగే పదవీ కాలం ముగిసిన కొందరు మంత్రులను తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ నిన్ననే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 21తో ముగిసింది. అందులో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేయగా, మరో మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ కూడా త్వరలోనే రాజీనామా సమర్పించనున్నారు. వీరిని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయకపోవడంతో, వీరికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రులు హర్ష మల్హోత్రా (ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు), పంకజ్ చౌదరి (ఉత్తరప్రదేశ్ బీజేపీ బాధ్యతలు)లకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే టాప్-4 లోని హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఇతర కీలక శాఖల మంత్రులపైనే మార్పుల ప్రభావం ఉంటుందని సమాచారం.

ఈ విడత క్యాబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరగనుంది. తెలంగాణ నుంచి మహిళా కోటాలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరితో పాటు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎంపీలకు ఈ విస్తరణలో పెద్దపీట వేయనున్నారు.

వర్షాకాల సమావేశాల్లోపే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసి, అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ - డీలిమిటేషన్ (135వ రాజ్యాంగ సవరణ) బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. గత ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్షాలు కోరిన కొన్ని మార్పులను చేర్చి ఈ కొత్త బిల్లును తీసుకురానున్నారు. నేడు జరగబోయే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో వర్షాకాల సమావేశాల తేదీలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి అవసరమైన బలం ఉండగా.. లోక్‌సభలో టీఎంసీ, డీఎంకే అసమ్మతి ఎంపీల సహకారంతో ఈ చారిత్రాత్మక బిల్లును గట్టెక్కించాలని మోదీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story