Model Twisha Sharma Death Case: మోడల్ త్విషా శర్మ కేసులో ట్విస్ట్.. చనిపోయే ముందు సెలూన్ లో ఏం చేసింది?
Model Twisha Sharma Death Case: మోడల్ త్విషా శర్మ మృతి కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు ఆమె ఓ సెలూన్‌లో 3 గంటలు గడిపినట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ద్వారా తేలింది.
Model Twisha Sharma Death Case: మోడల్ త్విషా శర్మ కేసులో ట్విస్ట్.. చనిపోయే ముందు సెలూన్ లో ఏం చేసింది?
Model Twisha Sharma Death Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మోడల్ త్విషా శర్మ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆమె చనిపోవడానికి కేవలం కొన్ని గంటల ముందు ఒక బ్యూటీ సెలూన్‌లో దాదాపు మూడు గంటల పాటు గడిపినట్లు సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ హైప్రొఫైల్ కేసులో ఈ తాజా పరిణామం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నోయిడాకు చెందిన మోడల్ త్విషా శర్మ ఈ నెల 12న భోపాల్‌లోని తన అత్తింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె చనిపోయిన రోజే మధ్యాహ్నం 3:12 గంటలకు స్థానికంగా ఉన్న ఒక సెలూన్‌కు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. అక్కడ ఆమె హెడ్ మసాజ్, పెడిక్యూర్ చేయించుకుని సాయంత్రం 6:15 గంటలకు బయటకు వచ్చారు.
ఈ కేసుపై సెలూన్ యజమాని కిరణ్ పరిహార్ స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్విషా మరణించిన మరుసటి రోజు ఉదయమే ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి అయిన గిరిబాలా సింగ్ తనకు ఫోన్ చేసి.. త్విషా ఎప్పుడు వచ్చింది? డబ్బులు ఎలా కట్టింది? అని ఆరా తీశారని చెప్పారు. త్విషా తన సోదరుడి పెళ్లి కోసం ఫిబ్రవరిలోనే ప్రీపెయిడ్ ప్యాకేజీ తీసుకోవడం వల్ల ఆ రోజు నగదు చెల్లించలేదని తాను చెప్పానన్నారు.
అదే రోజు మధ్యాహ్నం గిరిబాలా మళ్లీ ఫోన్ చేసి త్విషా సూసైడ్ చేసుకుందని చెప్పారని కిరణ్ పేర్కొన్నారు. అయితే, ఆ ఫోన్ వచ్చిన కొద్దిసేపటికే లాయర్ల తరహా దుస్తులు ధరించిన ఐదారుగురు గుర్తుతెలియని వ్యక్తులు సెలూన్‌కు వచ్చి.. పోలీసులకు కావాలంటూ సీసీటీవీ ఫుటేజ్‌ను తీసుకెళ్లడం ఇప్పుడు సరికొత్త అనుమానాలకు తావిస్తోంది.
త్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ (రిటైర్డ్ జడ్జి) అదనపు వరకట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని త్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దీనిని ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు త్విషా మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టమ్ నిర్వహించేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
గత పది రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న త్విషా భర్త సమర్థ్ సింగ్‌ను నిన్న రాత్రి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతడిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ లీక్ అవ్వడం, భర్త అరెస్ట్ కావడంతో కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.




