శ్రీనంద కేసు విషాదాంతం: 1500 అడుగుల లోయలో బాలిక మృతదేహం!

Shreenanda: కర్ణాటక చిక్కమంగళూరులో విషాదం. చంద్రద్రోణ హిల్స్‌లో అదృశ్యమైన కేరళ బాలిక శ్రీనంద 1500 అడుగుల లోయలో శవమై కనిపించింది.

Arun Chilukuri
Published on: 11 April 2026 12:09 PM IST
Shreenanda Missing Case
X

శ్రీనంద కేసు విషాదాంతం: 1500 అడుగుల లోయలో బాలిక మృతదేహం!

Shreenanda: గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కేరళ బాలిక శ్రీనంద (14) మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా చంద్రద్రోణ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్తూ అదృశ్యమైన ఆమె, మాణిక్యధార వ్యూపాయింట్ వద్ద 1500 అడుగుల లోతులో శవమై కనిపించింది.

అసలేం జరిగింది?

కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని శ్రీనంద, ఏప్రిల్ 7న తన కుటుంబ సభ్యులు 40 మందితో కలిసి కర్ణాటక పర్యటనకు వచ్చింది. హంపీ సందర్శన అనంతరం వారు చిక్కమంగళూరు చేరుకున్నారు. మధ్యాహ్నం చంద్రద్రోణ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన సమయంలో, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శ్రీనంద అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

డ్రోన్లు, థర్మల్ కెమెరాలతో గాలింపు:

బాలిక ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం కావడంతో డ్రోన్లు, థర్మల్ కెమెరాలను రంగంలోకి దించారు. నాలుగు రోజుల సుదీర్ఘ అన్వేషణ తర్వాత, మాణిక్యధార వ్యూపాయింట్ కింద భారీ లోయలో ఆమె మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

శ్రీనంద మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఆమె కిడ్నాప్‌కు గురైందని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర కూడా ఈ కేసుపై స్పందిస్తూ అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పోలీసులు ప్రస్తుతం బాలిక తల్లిదండ్రుల ఫోన్లను సీజ్ చేశారు. కుటుంబ సభ్యులందరినీ విడివిడిగా విచారిస్తున్నారు. ప్రమాదవశాత్తు లోయలో పడిందా? లేక ఎవరైనా నెట్టేశారా? అన్న కోణంలో పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ట్రిప్‌కు వచ్చి విగతజీవిగా మారిన శ్రీనందను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story