Road Accident : కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. మంటల్లో చిక్కుకుని 9 మంది సజీవ దహనం

Road Accident : ఉత్తరప్రదేశ్‌ మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కు రెండు కార్లను ఢీకొనడంతో మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనం అయ్యారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌తో సహా మొత్తం 11 మంది మృతి చెందారు.

CR Reddy
Published on: 23 April 2026 7:41 AM IST
Road Accident
X

Road Accident

Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి గుండెల్ని పిండేసే ఘోర ప్రమాదం జరిగింది. డ్రమ్మండ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్కా ఘుమాన్ మలుపు వద్ద అతి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత భీభత్సంగా జరిగిందంటే.. ఢీకొన్న వెంటనే రెండు కార్లలోనూ మంటలు చెలరేగి, అందులో ప్రయాణిస్తున్న 9 మంది సజీవ దహనమయ్యారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్‌తో కలిపి మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ప్రమాదానికి సంబంధించి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ వైపు నుంచి వస్తున్న ఒక భారీ ట్రైలర్ వెనుక ఒక బొలెరో, ఒక స్విఫ్ట్ డిజైర్ కార్లు వెళ్తున్నాయి. బడ్కా ఘుమాన్ మలుపు వద్ద వెనుక నుంచి శనగల లోడుతో అతి వేగంగా వచ్చిన మరో ట్రక్కు ఈ రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ రెండు కార్లు ముందున్న ట్రైలర్ కి, వెనుక ఉన్న ట్రక్కు మధ్య నలిగిపోయాయి. ఈ ఘర్షణ కారణంగా వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే.. కార్లలో ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. బొలెరో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలతో సహా ఎనిమిది మంది అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. స్విఫ్ట్ డిజైర్ కారులో ఉన్న డ్రైవర్ కూడా సజీవ దహనమయ్యాడు. స్థానికులు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, మంటల వేడికి ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. సహాయం కోసం లోపల ఉన్నవారు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేశాయి.

ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న 9 మందితో పాటు ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కూడా మరణించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది మంటలను ఆర్పిన తర్వాత మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు. ఈ ప్రమాదం కారణంగా వారణాసి-రీవా హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మీర్జాపూర్ పోలీస్ యంత్రాంగం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాత్రి వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు అతివేగం వద్దు అని, ముఖ్యంగా మలుపుల వద్ద జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, మృతుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story