Mamata Banerjee: బెంగాల్ రెండో విడత పోలింగ్‌లో ఉద్రిక్తత.. రిగ్గింగ్ జరుగుతోందన్న మమత.. గూండాయిజం అన్న సువేందు!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రెండో విడత పోలింగ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ఉన్నారని మమత ఆరోపించగా, ఆమెకు ఎవరూ ఓటేయరని సువేందు ఎద్దేవా చేశారు.

Arun Chilukuri
Published on: 29 April 2026 1:03 PM IST
Mamata Banerjee
X

Mamata Banerjee: బెంగాల్ రెండో విడత పోలింగ్‌లో ఉద్రిక్తత.. రిగ్గింగ్ జరుగుతోందన్న మమత.. గూండాయిజం అన్న సువేందు!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ పోరు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా హైప్రొఫైల్ నియోజకవర్గమైన భవానీపుర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య పోరు వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్ద ఇరువురు నేతలు తారసపడటంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.

మమతా బెనర్జీ కూర్చొని ఉన్న చోటికే వచ్చిన సువేందు అధికారి.. ఆమెను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆమెను చూడండి.. ఈ రోజు ఆమెకు ఎవరూ ఓటేయరు" అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా మమత స్పందిస్తూ.. సువేందు గూండాలను వెంటేసుకొని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు.

ఎన్నికల నిర్వహణ తీరుపై మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం తీరును ఆమె తప్పుబట్టారు. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, కేంద్ర బలగాలు టీఎంసీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి ఓటర్లను భయపెడుతున్నాయని ఆరోపించారు. "ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. టీఎంసీ కార్యకర్తలను రాత్రి పూట కొట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఇది గూండాయిజం తప్ప మరొకటి కాదు" అని మమత మండిపడ్డారు.

రాష్ట్రంలోని చాప్రా, శాంతిపుర్‌, భంగర్‌ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫల్తా బూత్ వద్ద ఆందోళనకారులు నినాదాలు చేయడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నప్పటికీ ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 39.97 శాతం పోలింగ్ నమోదైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story