Nirav Modi : నీరవ్ మోదీకి లండన్ కోర్టులో భారీ షాక్.. భారత్ కు రప్పించేందుకు లైన్ క్లియర్

Nirav Modi : నీరవ్ మోదీ అప్పగింత కేసును తిరిగి ప్రారంభించాలన్న పిటిషన్‌ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. పీఎన్బీ స్కామ్ నిందితుడిని భారత్ కు రప్పించే ప్రక్రియలో సీబీఐకి ఇది అతిపెద్ద విజయం.

CR Reddy
Published on: 26 March 2026 8:48 AM IST
Nirav Modi
X

Nirav Modi

Nirav Modi : భారతదేశం గర్వించదగ్గ బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ కన్నం వేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చట్టం నుంచి తప్పించుకునే దారులు మూసుకుపోతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‎కు రూ.13,000 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టిన ఈ కిలాడీని భారత్‌కు రప్పించే ప్రక్రియలో కీలక విజయం లభించింది. తనను భారత్‌కు పంపించవద్దని, ఈ కేసును మళ్ళీ విచారణకు స్వీకరించాలని నీరవ్ మోదీ లండన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. నీరవ్ మోదీ తన ప్రత్యర్పణ(అప్పగింత) ఆర్డర్‌ను సవాల్ చేస్తూ, ఈ కేసును మళ్ళీ మొదటి నుంచి విచారించాలని లండన్ హైకోర్టులోని కింగ్స్ బెంచ్ డివిజన్‌ను ఆశ్రయించారు. గతంలో ఆయుధాల డీలర్ సంజయ్ భండారి కేసులో వచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని, తనను భారత్‌కు పంపితే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వాదించారు. అయితే, సీబీఐ బృందం లండన్ వెళ్లి అక్కడి ప్రాసిక్యూషన్ అధికారులకు పూర్తి ఆధారాలు అందజేసింది. నీరవ్ మోదీ వాదనలో ఎలాంటి కొత్త విషయాలు లేవని, ఈ కేసును మళ్ళీ తెరవాల్సినంత అసాధారణ పరిస్థితులు ఏవీ కనిపించడం లేదని కోర్టు తేల్చి చెప్పింది.

ఈ కేసులో విజయం సాధించడానికి సీబీఐ, భారత అధికారులు అహర్నిశలు శ్రమించారు. ఈ విచారణ కోసం ప్రత్యేకంగా దర్యాప్తు అధికారుల బృందం లండన్ వెళ్ళింది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తరఫు లాయర్లు సీబీఐ అందించిన పక్కా ఆధారాలతో కోర్టులో గట్టిగా వాదించారు. 2018 నుంచి మొదలైన ఈ న్యాయపోరాటం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. 2019లో అరెస్ట్ అయిన నీరవ్ మోదీ, అప్పటి నుంచి లండన్ లోని జైలులోనే ఉంటున్నారు. మధ్యలో కొన్ని సాంకేతిక అడ్డంకులు ఎదురైనా, 2025 ఆగస్టులో అవన్నీ తొలగిపోవడంతో భారత ప్రభుత్వం పట్టు మరింత బిగించింది.

PNB స్కామ్ అసలు కథేంటి?

నీరవ్ మోదీ, అతని మామ మెహల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారు. బ్యాంకు గ్యారెంటీ లెటర్లను దుర్వినియోగం చేస్తూ విదేశాల్లో రుణాలు పొంది, ఆ డబ్బును తమ సొంత వ్యాపారాలకు మళ్లించారు. ఇందులో నీరవ్ మోదీ వాటానే దాదాపు రూ.6,500 కోట్లుగా సీబీఐ తేల్చింది. ఈ కుంభకోణం బయటపడటంతో మోదీ దేశం దాటి పారిపోయారు. అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయనను రప్పించేందుకు అన్ని దౌత్య మరియు న్యాయ మార్గాలను వాడుతోంది.

ముందు ముందు ఏం జరగనుంది?

లండన్ హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంతో నీరవ్ మోదీకి చట్టపరమైన అవకాశాలు దాదాపుగా ముగిశాయి. అయితే, ఆయన యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‎ను ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. కానీ, భారత ప్రభుత్వం ఇప్పటికే నీరవ్ మోదీకి జైలులో కల్పించే సౌకర్యాలు, భద్రతపై లండన్ కోర్టులకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ హామీలను కోర్టులు గతంలోనే ఆమోదించాయి. కాబట్టి, త్వరలోనే నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే ప్రక్రియ ఊపందుకోనుంది.

CR Reddy

CR Reddy

Next Story