Maharashtra Floods: వరద ప్రవాహంలో సిలిండర్లు.. పాతాళగంగ నది ఒడ్డున ఉత్కంఠ!

Maharashtra Floods: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయగఢ్ జిల్లాలోని హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది.

Arun Chilukuri
Published on: 9 July 2026 11:21 AM IST
Maharashtra Floods
X

Maharashtra Floods: వరద ప్రవాహంలో సిలిండర్లు.. పాతాళగంగ నది ఒడ్డున ఉత్కంఠ! 

Maharashtra Floods: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయగఢ్ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని రసాయన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్‌పీసీఎల్ పాతాళ్‌గంగ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను వరద నీరు ముంచెత్తింది. ప్లాంట్ రక్షణ గోడ కూలిపోవడంతో, అక్కడున్న సుమారూ 3,000 గ్యాస్ సిలిండర్లు వరద నీటి తీవ్రతకు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి.

వందలాది సిలిండర్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు వంతెనలపై నిలబడి మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

నదిలో కొట్టుకుపోతున్న సిలిండర్లలో కొన్ని నిండినవి, మరికొన్ని ఖాళీవి కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాయగఢ్‌ జిల్లా కలెక్టర్ కిషన్ జావ్‌లే ప్రజలకు అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. "నదిలోకి కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, అవి సురక్షితమైన స్థితిలో ఉన్నాయో లేదో చెప్పలేం. కేవలం ఉత్సుకతతోనో లేదా సొంత అవసరాల కోసమో వాటిని ఇంటికి తీసుకెళ్లడం, విప్పడం లాంటివి చేస్తే ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎవరూ వాటిని ముట్టుకోవద్దు." అని కలెక్టర్ కిషన్ జావ్‌లే తెలిపారు.

నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు, తహశీల్దార్ కార్యాలయానికి లేదా సమీపంలోని హెచ్‌పీసీఎల్ డీలర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. వీటిని గుర్తించి, సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే దాదాపు 1,000 సిలిండర్లను అధికారులు సురక్షితంగా వెలికితీశారు, మిగిలిన వాటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story