School Van Accident : నడుస్తున్న వ్యాన్‌లో ఊడిన తలుపు.. చిన్నారి మృతి

School Van Accident : మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. రోజూ లాగే స్కూల్‌కి వెళ్తున్న ఒక పదేళ్ల చిన్నారి, నడుస్తున్న వ్యాన్ తలుపు..

G Krishna
Published on: 10 Sept 2026 10:28 AM IST
van-accident
X

van-accident

School Van Accident : మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. రోజూ లాగే స్కూల్‌కి వెళ్తున్న ఒక పదేళ్ల చిన్నారి, నడుస్తున్న వ్యాన్ తలుపు సడన్‌గా ఊడిపోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. విజయరాఘవగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున భయాందోళనలు రేకెత్తించింది. విజయరాఘవగఢ్‌కు చెందిన దినేష్ యాదవ్ కొడుకు స్థానిక ద్వారకా పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్ వ్యాన్‌లో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగింది. వ్యాన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న సమయంలో వాహనం తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో, బాలుడు బయట పడిపోయాడు. వెంటనే ఆ వ్యాన్ వెనుక చక్రం చిన్నారిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణాలు

ప్రమాదం జరగగానే అక్కడే ఉన్నవాళ్లు చిన్నారిని వెంటనే విజయరాఘవగఢ్ ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీయించారు. కానీ, బాలుడిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని చెప్పారు. కొడుకు ఇక లేడనే వార్త వినగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

రోడ్డుపై బంధువుల ఆందోళన

పాఠశాల యాజమాన్యం, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుడి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పిల్లల భద్రతను గాలికొదిలేసిన స్కూల్ యాజమాన్యంపై, డ్రైవర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డ్రైవర్‌ అరెస్ట్... వ్యాన్ సీజ్

విషయం తెలుసుకున్న విజయరాఘవగఢ్ ఇన్ స్పెక్టర్ అభిషేక్ చౌబే తన టీమ్‌తో అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. పోలీసులు ప్రమాదానికి కారణమైన స్కూల్ వ్యాన్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రయాణంలో తలుపు ఎలా తెరుచుకుంది? అసలు ఆ వ్యాన్‌కు సరైన కండిషన్ ఉందా లేదా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags: School Van Accident, Madhya Pradesh, Katni, Student Death, School Safety

SEO Meta Keywords: School Van Accident, Katni, Madhya Pradesh, Student Death, School Safety

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story