Lalit Modi : ఫెమా కేసులో లలిత్ మోదీకి క్లీన్ చిట్.. విక్టరీ డ్యాన్స్ వీడియో వైరల్..!

Lalit Modi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి 16 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత భారీ సంచలన విజయం లభించింది. 2009 నాటి విదేశీ

G Krishna
Published on: 22 July 2026 11:40 AM IST
Lalit-Modi
X

Lalit-Modi

Lalit Modi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి 16 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత భారీ సంచలన విజయం లభించింది. 2009 నాటి విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనపై విధించిన రూ. 10.65 కోట్ల భారీ జరిమానాను అపీలేట్ ట్రిబ్యునల్ పూర్తిగా రద్దు చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పుతో తనపై ఉన్న మచ్చ తొలగిపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన లలిత్ మోదీ, లండన్‌లో విక్టరీ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అసలేంటి ఈ 2009 ఐపీఎల్ వివాదం.?

వివరాల్లోకి వెళితే, 2009వ సంవత్సరంలో భారతదేశంలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో లీగ్‌లోని మ్యాచ్‌లకు తగినంత పోలీసు భద్రత కల్పించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఐపీఎల్ రెండో సీజన్‌ను భారత్‌లో నిర్వహించడం అసాధ్యంగా మారింది. ఆ కీలక సమయంలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు , లీగ్ నిలిచిపోకుండా కాపాడేందుకు లలిత్ మోదీ నేతృత్వంలో ఐపీఎల్ పాలకమండలి టోర్నమెంట్‌ను రాత్రికి రాత్రే దక్షిణాఫ్రికాకు తరలించింది. అయితే, దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహణ కోసం జరిపిన భారీ నిధుల బదిలీ ప్రక్రియలో ఆర్‌బీఐ అనుమతులు తీసుకోలేదని , విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈడీ (ED) కేసులు నమోదు చేసింది. బిసిసిఐతో పాటు లలిత్ మోదీపై కోట్ల రూపాయల జరిమానాలు విధించింది.

ట్రిబ్యునల్ ఇచ్చిన కీలక తీర్పు, ఆధారాలు

ఈ సుదీర్ఘ విచారణ అనంతరం అపీలేట్ ట్రిబ్యునల్ లలిత మోదీకి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఐపీఎల్ 2009ను దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు జరిపిన లావాదేవీలు క్యాపిటల్ అకౌంట్ కిందకు రావని, ఇవి సాధారణ కరెంట్ అకౌంట్ ఫారిన్ రిమిటెన్స్ కిందకే వస్తాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

దీనితో పాటు బిసిసిఐ తరఫున ఫెమా నిబంధనల అమలుకు లలిత్ మోదీ ఒక్కరే బాధ్యుడు కాదని, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఆయనకు ఒక్కరికే లేదని తేల్చిచెప్పింది. తగిన ఆధారాలు లేకుండానే ఆయనపై అనవసరంగా జరిమానా విధించారని పేర్కొంటూ రూ. 10.65 కోట్ల ఫైన్‌ను పూర్తిగా కొట్టివేసింది. లలిత్ మోదీతో పాటు బిసిసిఐపై విధించిన రూ. 4 కోట్ల జరిమానాను రూ. 1 కోటికి, అప్పటి బిసిసిఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ జరిమానాను రూ. 1 కోటి నుంచి రూ. 10 లక్షలకు, ఖజానాదారు ఎం.పీ. పాండోవ్ జరిమానాను రూ. 50 లక్షల నుంచి రూ. 5 లక్షలకు ట్రిబ్యునల్ భారీగా తగ్గించి ఉపశమనం కలిగించింది.

"16 ఏళ్ల పోరాటానికి దక్కిన సత్యమే జయము"

తీర్పు వెలువడిన వెంటనే లలిత్ మోదీ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. గత 16 సంవత్సరాలుగా తాను ఎలాంటి వ్యక్తిగత తప్పు చేయలేదని చెబుతూ వచ్చానని, చివరికి సత్యమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించేందుకు తాను తీసుకున్న ధైర్యమైన నిర్ణయం వల్లే నేడు ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన , ప్రజాదరణ పొందిన క్రీడా లీగ్‌లలో ఒకటిగా నిలదొక్కుకుందని గుర్తుచేశారు. ఈ విజయోత్సాహంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story