Kiren Rijiju: మహిళా శక్తిపై రాహుల్ వీడియో.. 'ఆయన మనసు మారినట్లుంది' అంటూ రిజిజు చురకలు!
Kiren Rijiju: మహిళా శక్తిపై రాహుల్ గాంధీ వీడియో సందేశంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చురకలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని డిమాండ్.
Kiren Rijiju: మహిళా శక్తిపై రాహుల్ వీడియో.. 'ఆయన మనసు మారినట్లుంది' అంటూ రిజిజు చురకలు!
Kiren Rijiju: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహిళా సాధికారతను ఉద్దేశించి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చురకలంటించారు.
'ఆస్క్ మి ఎనీథింగ్' (Ask Me Anything) సెషన్‌లో భాగం నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడారు. భారతీయ మహిళల శక్తి ఇంకా బందీగానే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాలు, వ్యాపార రంగాల్లోనే కాకుండా సొంతింట్లో కూడా మహిళలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం దక్కడం లేదని అన్నారు. మహిళలకు భాగస్వామ్యం లేని ఏ దేశమూ విజయం సాధించలేదని, మహిళల గళాన్ని వినిపించేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే తన రాజకీయాల్లో ప్రధాన అంశమని రాహుల్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారిక ఖాతా షేర్ చేసిన ఈ వీడియోపై కిరణ్ రిజిజు స్పందిస్తూ.. "ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సానుకూల సందేశం వచ్చినట్లుంది. మహిళల విషయంలో రాహుల్ గాంధీ ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మహిళా సాధికారతపై ఇంత సానుకూలంగా మాట్లాడుతున్నందున, ఇకనైనా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు రిజిజు ఎద్దేవా చేశారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో, రాహుల్ వీడియో సందేశంపై రిజిజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.




