Ketan Murder Case: నా కూతురిని ఉరి తీయండి.. సియా తల్లి కీలక వ్యాఖ్యలు

Ketan Murder Case: సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్‌కు కన్నవారి మద్దతు కూడా పూర్తిగా కరువైంది...

G Krishna
Published on: 26 Jun 2026 10:27 AM IST
siya parents
X

siya parents

Ketan Murder Case: సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్‌కు కన్నవారి మద్దతు కూడా పూర్తిగా కరువైంది. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సియాపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సియా గనుక దోషిగా తేలితే ఆమెకు ఉరిశిక్ష విధించాలని, చట్టం ముందు తాము అడ్డు నిలబడబోమని స్పష్టం చేశారు.

ఆ కోట నుండే కిందకు తోసేయండి: తండ్రి ఆవేదన

ఈ దారుణ ఘటనపై సియా తల్లి స్పందిస్తూ.. "ఆమె నా కుమార్తె అయినప్పటికీ, తప్పు చేసి దోషిగా తేలితే మాత్రం ఉరి తీయాల్సిందే. ఒక తల్లిగా నేనే ఈ మాట చెబుతున్నాను" అని అన్నారు. ఆమె తండ్రి ప్రవీణ్ గోయల్ సైతం భార్య వ్యాఖ్యలను సమర్థిస్తూ, కేతన్‌ను హత్య చేసినట్లు రుజువైతే తన కుమార్తెను అస్సలు వదిలిపెట్టవద్దని డిమాండ్ చేశారు. పోలీసులు చేసిన ఆరోపణలు నిజమైతే, లోహగడ్ కోటపై నుండి కేతన్‌ను ఏ విధంగానైతే కిందకు తోసి చంపేశారో, సియాను కూడా అదే కోట నుండి కిందకు తోసేయాలంటూ ఆయన తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిగ్భ్రాంతితో ఐసీయూలో తండ్రి

ఎంతో గారాబంగా పెంచిన కుమార్తె ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని తాము ఊహించలేదని, ఈ వార్త విన్నప్పటి నుండి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ప్రవీణ్ గోయల్ తెలిపారు. కూతురి పాపం తెచ్చిపెట్టిన అవమానం, బాధ భరించలేక జూన్ 23న ఆయన గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పూణేలోని ఒక ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తండ్రిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలోనే ఉండటంతో, పూణే మార్కెట్ యార్డ్‌లోని వారి నివాసం 'లీలా కుంజ్' ప్రస్తుతం తాళం వేసి ఉంది.

పుట్టినరోజు వేడుకల నెపంతో ఘోరం

పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో సియా గోయల్‌కు వివాహం నిశ్చయమైంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని సియా, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. జూన్ 17న పుణెలోని ఒక కేఫ్‌లో కలుసుకున్న ఈ ఇద్దరు ప్రేమికులు హత్యకు పక్కా వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే జూన్ 18న తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను లోహగడ్ కోటకు సియా తీసుకువెళ్లింది. వారిని అనుసరిస్తూ ప్రియుడు చేతన్ కూడా అక్కడికి చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు లభించాయి. కోటపై ఎవరూ లేని సమయం చూసి, సియా , చేతన్ ఇద్దరూ కలిసి కేతన్‌ను కొండ అంచు నుండి కిందికి తోసి చంపేశారు.

ప్రమాదం అనుకున్నారు.. కానీ

మొదట్లో ఈ ఘటన కొండపై నుండి ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లుగా భావించారు. అయితే కేతన్ మరణంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీసీటీవీ విజువల్స్, కాల్ డేటా ఆధారంగా ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ జూన్ 29 వరకు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. అధికారులు వీరిని మరింత లోతుగా విచారిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story