Kangana Ranaut : రాముడి పేరుతో కాంగ్రెస్ రాజకీయం.. కంగనా రనౌత్ ఫైర్..!

Kangana Ranaut : అయోధ్య రామాలయం విరాళాల వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశాన్ని వేదికగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల

G Krishna
Published on: 8 July 2026 4:57 PM IST
Kangana-Ranaut
X

Kangana-Ranaut

Kangana Ranaut : అయోధ్య రామాలయం విరాళాల వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశాన్ని వేదికగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా ఈ వివాదంపై హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ బుధవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏళ్ల తరబడి అయోధ్యలో భవ్య మందిర నిర్మాణాన్ని అడ్డుకున్న కాంగ్రెస్, ఇప్పుడు అదే రామాలయం అంశాన్ని వాడుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ , దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న "ద్వంద్వ నీతి" గురించి పూర్తిగా తెలుసని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతల విమర్శలు.. కంగనా కౌంటర్

అంతకుముందు రోజు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. అయోధ్య రామాలయం విరాళాలలో జరిగిన అవకతవకలు కేవలం డబ్బు దొంగతనం మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దొంగిలించడమేనని విమర్శించారు. అలాగే రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ కూడా స్పందిస్తూ.. ఇలాంటి ఘోరమైన అవకతవకలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగి ఉంటే బీజేపీ దేశవ్యాప్తంగా నిప్పు పెట్టేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందిస్తూ.. కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల నిరీక్షణ, త్యాగాలు , భక్తి ఫలితంగానే నేడు రామాలయ నిర్మాణం సాధ్యమైందని గుర్తుచేశారు. బీజేపీ ఎప్పుడూ ప్రజా విశ్వాసాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోలేదని, దానిని దేశ సాంస్కృతిక గుర్తింపుగా గౌరవించిందని స్పష్టం చేశారు.

సొంత రాష్ట్రంలో తప్పులు చేస్తూ ఇక్కడ నీతులా..?

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కంగనా రనౌత్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సొంత రాష్ట్రంలోని స్థానిక దేవాలయాల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వ పథకాల కోసం వాడుకోవాలని చూస్తోందని, ధార్మిక సంస్థల వనరులపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అలాంటి పనులు చేస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు అయోధ్య రామాలయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవిత్రమైన రామాలయం అంశంపై రాజకీయం చేయడం ఆపి, కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలపై సమాధానం చెప్పుకోవాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు. ప్రజలు కాంగ్రెస్ నైజాన్ని గ్రహించారని, వారికి కేవలం అభివృద్ధి, సుపరిపాలన మాత్రమే కావాలని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..?

అయోధ్య రామాలయానికి వస్తున్న నగదు కానుకల దుర్వినియోగం, విరాళాల మళ్లింపుపై ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను ఎస్ఐటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిఘా పెరగడంతో, తీవ్ర ఒత్తిడి నడుమ శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. సోమవారం జరిగిన ట్రస్ట్ సమావేశంలో వారి రాజీనామాలను ఆమోదించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం కృష్ణా మోహన్‌ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎస్ఐటీ విచారణ, ట్రస్ట్‌లో జరిగిన మార్పులను సాకుగా చూపిస్తూ దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story