West Bengal: పశ్చిమ బెంగాల్ లో న్యాయాధికారుల నిర్బంధం..సుప్రీం కోర్ట్ సీరియస్

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల పరిశీలకులను ప్రజలు నిర్బంధించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి

KVD Varma
Published on: 2 April 2026 12:22 PM IST
West Bengal: పశ్చిమ బెంగాల్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల పరిశీలకులను ప్రజలు నిర్బంధించారు
X

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలిగించారంటూ ప్రజలు SIR అధికారులపై నిరసనలకు దిగుతున్నారు. అదే క్రమంలో పరిస్థితి చేయిదాటిపోతోంది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లను తొలగించిన తర్వాత బుధవారం రాత్రి మాల్దాలోని మాతాబారిలో వేలాది మంది ప్రజలు ఏడుగురు న్యాయాధికారుల కార్యాలయాలను చుట్టుముట్టారు. వారిని తొమ్మిది గంటల పాటు బందీలుగా పట్టుకున్నారు. పోలీసుల జోక్యంతో వారు అతి కష్టం మీద ఆ గుంపు నుంచి రక్షణ పొందారు. ఈ తొమ్మిది గంటల సమయంలో వారికి కనీసం మంచినీళ్లు తాగే అవకాశం కూడా ఇవ్వలేదని వారు చెప్పారు.

సుప్రీం సీరియస్..

ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. సీబీఐ లేదా ఎన్ఐఏ వంటి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించి, ఆ సంస్థ నేరుగా కోర్టుకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్ఐఆర్‌కు అనుబంధంగా ఉన్న ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వారికి ఆహారం, నీరు నిరాకరించడంతో పాటు, హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కలిసేందుకు కూడా అనుమతించక పోవడం దారుణమైన చర్య అని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొంది.

అసలేం జరిగిందంటే..

మాల్దాలోని మాతాబారి బీడీవో కార్యాలయానికి ఏప్రిల్ 1 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏడుగురు న్యాయాధికారులు ఎన్నికల పరిశీలకులుగా వచ్చారు. ఈ అధికారులు సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రెండు గంటల తరువాత.. అంటే సుమారుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వందలాది మంది బీడీవో కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అటు తరువాత 9 గంటల పాటు ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి.. ఈ ఏడుగురు అధికారులతో పాటు మరో ఇద్దరు మహిళలను నిర్బంధించారు. ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ వారు ఈ చర్యను చేపట్టారు. ఈ సమయంలో అధికారులను తొమ్మిది గంటల పాటు బందీలుగా ఉంచారు. వారికి ఆహారం, నీరు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ పరిస్థితి స్థానిక అధికారులకు తెలిసినప్పటికీ సకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత పోలీసులు ఆందోళన కారులకు నచ్చచెప్పి న్యాయాధికారులను విడిపించారు. వారిని విడిపించి పంపిస్తున్న సమయంలో కూడా అక్కడి ప్రజలు వారి వాహనాలపై రాళ్లు విసిరి, కర్రలు, ఇటుకలతో దాడి చేశారు.

ఈ సంఘటన సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో ఈ ఘటనపై విచారణకు కోర్టు ఆదేశించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story