Jharkhand: ఝార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల రద్దుపై హైకోర్టు స్టే!

Jharkhand: ఝార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల రద్దుపై హైకోర్టు స్టే విధించింది. 15 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Aug 2026 10:40 AM IST
Jharkhand
X

Jharkhand: ఝార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల రద్దుపై హైకోర్టు స్టే!

Jharkhand: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ ఝార్కండ్ సర్కార్ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై హై కోర్టు స్టే విధించింది. ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని హై కోర్టు వ్యాఖ్యానించింది.దీంతో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి ఊరట లభించింది.

ఝార్ఖండ్ పరీక్షల్లో అక్రమాల కేసు కీలక మలుపు తిరిగింది. 11, 13వ జేపీఎస్‌సీ పరీక్షలు, నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలంటూ పలువురు హై కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఝార్కండ్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులపై హై కోర్టు స్టే విధించింది.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన 44 నియామక పరీక్షలను ప్రభుత్వ రద్దు చేసింది.

అలాగే నియామక పరీక్షలలో అవకతవకలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించింది. 2014 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

తమ వాదన వినకుండా పరీక్షలు, నియామకాలను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. అలాగే పలువురు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని వెల్లడించారు. అంతేకాదు ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకానీ, అందరినీ ఒకేసారి తొలగించడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. తాము నిబంధనల ప్రకారమే పరీక్షలు రాసి మెరిట్‌ జాబితాలో ఉద్యోగాలు పొందామని స్పష్టం చేశారు.

కాగా పిటిషనర్ల వాదనలను ఝార్ఖండ్ హై కోర్టు పరిగణనలోకి తీసుకుంది.దీంతో నియామక పరీక్షల రద్దుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. దీనిపై 15 రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఝార్కండ్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

ఇదిలా ఉంటే, ప్రభుత్వ ఉత్తర్వులపై హై కోర్టు స్టే విధించడంపై ఝార్ఖండ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ప్రదీప్ యాదవ్ స్పందించారు. హైకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కాగా పరీక్షల అవకతవకలపై విచారణ జరపడం ద్వారా వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా భావించినందుకే ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆయన వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story