Hemant Soren: 2014 నుంచి జరిగిన అన్ని పరీక్షలు రద్దు.. సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం!

Hemant Soren: నియామక పరీక్షల్లో అక్రమాలపై విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో JSSC-CGL పరీక్షను రద్దు చేస్తూ ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 18 Aug 2026 12:03 PM IST
Hemant Soren
X

Hemant Soren: 2014 నుంచి జరిగిన అన్ని పరీక్షలు రద్దు.. సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం!

Hemant Soren: నియామక పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా నిరుద్యోగ యువత మరియు విద్యార్థులు చేపట్టిన ఉద్ధృత ఉద్యమం నేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఝార్ఖండ్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (JSSC) నిర్వహించిన ‘కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌’ (CGL) పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తూ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. "ఉద్యమిస్తున్న విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. దీంతో పాటు పొరుగు సేవల ప్రాతిపదికన 'టీఎస్‌ఆర్‌ డేటా ప్రాసెసింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్' (TDPL) సంస్థ 2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన అన్ని నియామక పరీక్షలను, వాటి ఫలితాలను రద్దు చేయాలని నిర్ణయించాం" అని తెలిపారు. పరీక్షల ప్రక్రియలో సంస్కరణలు సూచించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పరీక్షల కుంభకోణంలో అనేక ప్రైవేట్ కంపెనీల ప్రమేయం ఉందని, నియామకాల్లో అక్రమ పద్ధతులను నివారించేందుకు ఇప్పటికే కఠిన చట్టాన్ని తెచ్చామని సీఎం పేర్కొన్నారు. సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో అనేక విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయంతో జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్ష రద్దు కావడం వల్ల అప్పటికే ఉద్యోగాలు పొందిన దాదాపు 2,000 మంది తీవ్ర ఆందోళనలో పడ్డారు. సోమవారం రాత్రి ఝార్ఖండ్ సచివాలయం ఎదుట వారు నిరసన చేపట్టారు. కాగా, ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) విచారణ జరిపాలనే ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు తమ పోరాటం ఆగేది లేదని ‘జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్’ స్పష్టం చేసింది. గత 16 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర మహతో త్వరలోనే దీక్ష విరమిస్తానని ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story