Ranchi Protest : జార్ఖండ్‌లో బీజేపీ బంద్.. రోడ్లపై రచ్చ, టైర్ల దహనం.!

Ranchi Protest : జార్ఖండ్‌లో విద్యార్థుల అసెంబ్లీ ముట్టడిపై పోలీసుల లారీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త

G Krishna
Published on: 11 Aug 2026 11:49 AM IST
Ranchi
X

Ranchi

Ranchi Protest : జార్ఖండ్‌లో విద్యార్థుల అసెంబ్లీ ముట్టడిపై పోలీసుల లారీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌తో రాజధాని రాంచీ సహా పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. సోమవారం శాసనసభ వైపునకు దూసుకెళ్లిన వేలాది మంది అభ్యర్థులపై పోలీసు బలగాలు ప్రయోగించిన బలప్రయోగాన్ని ఖండిస్తూ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ బంద్ కొనసాగింది.

రాంచీ వ్యాప్తంగా నిరసనలు.. ప్రధాన రహదారుల దిగ్బంధం

బంద్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాంచీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. కాంకే రోడ్‌లోని సిఎంపిడిఐ గేట్, కిషోర్‌గంజ్, అర్గోరా, హర్ము చౌక్, న్యూక్లియస్ మాల్ పరిసర ప్రాంతాల్లో టైర్లను తగలేసి రహదారులను దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగి ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. అయితే, ప్రజల అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదిత్య సాహూ వెల్లడించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడం మానేసి, హేమంత్ సోరెన్ ప్రభుత్వం వారిపై అరాచకపూరితంగా దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.

జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అక్రమాలపై ఉధృతమైన ఆందోళన

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలు, తీవ్ర అక్రమాలపై దాదాపు మూడు వారాలుగా (జూలై 25 నుంచి) విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా సోమవారం వేలాది మంది అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లను బద్దలు కొట్టుకుని మూడు గేట్లను దాటుకుని లోపలికి దూసుకెళ్లిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లారీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో 14 మంది పోలీసులతో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో స్పృహతప్పడంతో ఆయనను స్ట్రెచర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇది విద్యార్థుల పోరాటం: రాజకీయం కాదన్న అభ్యర్థులు

మరొకవైపు తమ ఆందోళనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. తమ డిమాండ్లకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తామని, అయితే తాము ఏ నిర్దిష్ట రాజకీయ పక్షానికి కొమ్ముకాసేది లేదని విద్యార్థి నాయకుడు పియూష్ తెలిపారు. నియామకాల్లో పారదర్శకత, సీబీఐ విచారణ , జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్ష రద్దు చేయడమే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో నేరుగా చర్చలు జరిపితేనే సమస్య పరిష్కారమవుతుందని విద్యార్థుల కమిటీ స్పష్టం చేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story