Cockroach Janta Party: జూన్ 23న రామ్‌లీలా మైదానంలో సీజేపీ నిరసన.. సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!
Cockroach Janta Party Protest: దేశంలో ప్రవేశ, రిక్రూట్‌మెంట్ పరీక్షల అవకతవకలపై విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవాలని...
Cockroach Janta Party Protest: జూన్ 23న రామ్‌లీలా మైదానంలో సీజేపీ తదుపరి నిరసన.. విద్యావ్యవస్థ సంస్కరణలపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!
Cockroach Janta Party Protest: దేశంలో వివిధ ప్రవేశ పరీక్షలు, రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలపై విద్యార్థి లోకం మరియు రాజకీయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) డిమాండ్ చేసింది. ఈ మేరకు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసనలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వం వహించగా.. ప్రముఖ విద్యావేత్త, సామాజిక యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనకారులను ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర భావోద్వేగంతో ప్రసంగించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. "పరీక్షల అవకతవకల వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకు ఈ అధికారులు, ప్రభుత్వం వేచిచూస్తారు? తమ పిల్లలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం విప్పితే ఎక్కడ జైల్లో పెడతారోనని ఈ దేశంలోని ప్రతి తల్లి భయపడుతోంది. ఈ భయం నీడలోనే ఎంతకాలం బతకాలి?" అని దీప్కే ప్రశ్నించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని కనిపించిన ఆయన.. ఈ నిరసనల కోసమే అమెరికాలోని బోస్టన్ నుంచి ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రిని తొలగించాలని నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని, సోషల్ మీడియాలో సీజేపీ అకౌంట్లను హ్యాక్ చేస్తూ పోస్టులను డిలీట్ చేయిస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ పోస్టులను డిలీట్ చేయగలరు కానీ విద్యార్థుల ఆకాంక్షలను ఏమార్చలేరని హెచ్చరిస్తూ.. పేపర్ లీకుల వల్ల బలైన పలువురు విద్యార్థుల పేర్లను చదివి వినిపించి వారికి సంతాపం ప్రకటించారు.
ఈ నిరసనల్లో పాల్గొన్న పర్యావరణ, విద్యా ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను దేశ విద్యాశాఖ మంత్రిగా చూడాలని భావిస్తున్నట్లు పలువురు విద్యార్థులు ఆకాంక్షించారు. అయితే, దీనిపై వాంగ్‌చుక్ స్పందిస్తూ.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఎంతమాత్రం లేదని నిష్కర్షగా చెప్పారు. దేశ విద్యావ్యవస్థను మార్చే బాధ్యతలను యువకులే భుజానకెత్తుకోవాలని పిలుపునిచ్చారు.
"రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివేలా నిబంధనలు తేవాలి. అప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది. ప్రస్తుతం ఉన్న లోపభూయిష్టమైన విద్యా విధానంలో తక్షణ మార్పులు అవసరం" అని వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు. ఈ నిరసన ప్రదర్శనకు శాంతియుతంగా అనుమతి ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ అనేది తమ సుదీర్ఘ పోరాటంలో ఒక ఆరంభం మాత్రమేనని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల హక్కుల రక్షణే ధ్యేయంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేంతవరకు ఉద్యమిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే తమ తదుపరి భారీ నిరసన ప్రదర్శనను ఈ నెల 23న (జూన్ 23) న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో నిర్వహించేందుకు సీజేపీ సన్నాహాలు చేస్తోంది.




