ISRO: అర్థరాత్రి అంతరిక్షంలో ఇస్రో సంచలనం.. నింగిలోకి దూసుకెళ్లిన GSLV F1

ISRO: ఇస్రో మరో ఘనత సాధించింది. జియోసింక్రోనస్ కక్ష్యలోకి 'ఈవోఎస్-05' ఇమేజింగ్ శాటిలైట్‌ను జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది.

CR Reddy
Published on: 4 Sept 2026 7:04 AM IST
ISRO: అర్థరాత్రి అంతరిక్షంలో ఇస్రో సంచలనం..  నింగిలోకి దూసుకెళ్లిన GSLV F1
X

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరిహద్దుల వద్ద శత్రువుల కదలికలను నిమిషాల వ్యవధిలో పసిగట్టే అత్యాధునిక ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్-05ను నింగిలోకి విజయవంతంగా పంపింది. శ్రీహరికోట నుంచి అర్థరాత్రి వేళ దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున సరిగ్గా 2:55 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం రాత్రి 11:30 గంటలకు ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ ఎటువంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, సమయం అర్ధరాత్రి దాటినప్పటికీ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వందలాది మంది ప్రజలు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రాంగణానికి చేరుకోవడం విశేషం. భూమి నుంచి బయలుదేరిన 18 నిమిషాల వ్యవధిలోనే 2,367 కిలోల బరువున్న ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని రాకెట్ నిర్ణీత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలో ప్రవేశపెట్టింది.

నింగిలో భారత్ మూడో కన్ను

సాధారణంగా భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ నుంచి పనిచేస్తాయి. కానీ ఈవోఎస్-05 శాటిలైట్ భూమికి ఏకంగా 36,000 కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్యలో తిరుగుతూ సేవలు అందిస్తుంది. ఈ ఎత్తులో భూమి భ్రమణ వేగంతో సమానంగా తిరుగుతూ భారత ఉపఖండంపై ఎల్లవేళలా దృష్టి సారిస్తుంది. సైంటిస్టులు ఈ ఉపగ్రహాన్ని ఆకాశంలో మూడో కన్నుగా అభివర్ణిస్తున్నారు. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను నిమిషాల వ్యవధిలో పసిగట్టడంతో పాటు వ్యవసాయ రంగం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల నిర్వహణలో కీలకమైన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది.

పాత వైఫల్యాలకు స్వస్తి

గత కొన్నేళ్లుగా జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఎదురైన సాంకేతిక అడ్డంకులకు ఈ విజయంతో ఇస్రో చెక్ పెట్టింది. 2021లో క్రయోజెనిక్ దశలో సంభవించిన లోపం వల్ల ఈవోఎస్-03 మిషన్ విఫలమైంది. అలాగే ఈ ఏడాది జనవరిలో పిఎస్ఎల్వి ప్రయోగం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రయోగ విజయం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు ప్రతి దశనూ అత్యంత జాగ్రత్తగా రూపొందించడం వల్ల ఈ సుదీర్ఘ నిరీక్షణకు తిరుగులేని విజయం లభించింది.

రాకెట్ సాంకేతిక సామర్థ్యం

మొత్తం 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువు ఉన్న ఈ జీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశలో అత్యంత శక్తివంతమైన దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను ఉపయోగించారు. గతంలో వచ్చిన సాంకేతిక లోపాలను అధిగమించేలా ఈ రాకెట్ కంప్యూటర్ వ్యవస్థలను పునర్నిర్మించారు. కక్ష్యలో ప్రవేశించిన ఉపగ్రహం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిన వెంటనే భారత రక్షణ విభాగానికి, వ్యూహాత్మక రంగాలకు అత్యంత కీలకమైన సమాచారం అందుతుందని ఇస్రో ఛైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story