Viral Video: విడాకులు తీసుకుని వస్తే.. బ్యాండ్ బాజాలతో స్వాగతం!

Viral Video: విడాకులు తీసుకుని ఇంటికి వచ్చిన కూతురికి ఓ తండ్రి బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు.

Arun Chilukuri
Published on: 6 April 2026 12:00 PM IST
Viral Video
X

Viral Video: విడాకులు తీసుకుని వస్తే.. బ్యాండ్ బాజాలతో స్వాగతం!

Viral Video: సాధారణంగా ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేటప్పుడు ఊరేగింపులు, బాజభజంత్రీలు చూడటం సహజం. కానీ, విడాకులు తీసుకుని పుట్టింటికి తిరిగి వచ్చిన కూతురికి బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. సామాజిక కట్టుబాట్లు, విడాకుల పట్ల ఉన్న చిన్నచూపును పక్కన పెట్టి.. తన కూతురి స్వేచ్ఛను సెలబ్రేట్ చేసిన ఒక తండ్రి ఇప్పుడు దేశవ్యాప్తంగా 'రియల్ హీరో'గా నిలుస్తున్నారు.

నరకం నుంచి విముక్తి.. పండగలా వేడుక!

మీరట్‌కు చెందిన గజానంద్ గుప్త కుమార్తె ప్రేమ్ లతా, పెళ్లి తర్వాత అత్తారింట్లో అనేక కష్టాలను అనుభవించింది. ఆ బంధం నరకప్రాయంగా మారడంతో, ఆమె తన భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకుని పుట్టింటికి చేరుకుంది. అయితే, తన కూతురు బాధలో ఉండకూడదని భావించిన గజానంద్.. ఆమె రాకను ఒక శుభకార్యంలా మార్చేశారు. బ్యాండ్ మేళాలు, డ్యాన్సులతో కూతురిని వీధుల్లో ఊరేగిస్తూ ఇంటికి తీసుకువచ్చారు. కూతురు ఇంటికి అడుగుపెట్టగానే బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. చుట్టుపక్కల వారికి మిఠాయిలు పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు.

తండ్రి స్పందన: 'విడాకులు జీవితాంతం కాదు'

ఈ సందర్భంగా గజానంద్ గుప్త మాట్లాడుతూ.. "నా కూతురు పెళ్లి తర్వాత నరకం చూసింది. ఆ బంధం నుంచి బయటపడటం మాకు పండగ లాంటిది. విడాకులు అంటే జీవితం ముగిసిపోవడం కాదు, అదొక కొత్త ప్రయాణానికి ఆరంభం. అందుకే నా బిడ్డకు గౌరవంగా, ధైర్యంగా స్వాగతం పలికాను" అని భావోద్వేగంతో చెప్పారు.

నెటిజన్ల ప్రశంసలు:

ఈ వినూత్న వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ తండ్రిని ‘సూపర్ డాడ్’ అంటూ కొనియాడుతున్నారు. సమాజం ఏమనుకుంటుందో అని భయపడే తండ్రులకు గజానంద్ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారని, కష్టాల్లో ఉన్న ఆడపిల్లలకు కుటుంబం అండగా ఉంటే వారు ఏదైనా సాధించగలరని కామెంట్స్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story