అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాకిస్థాన్‌ నౌక.. భారత్ తీవ్ర నిరసన!

Arabian Sea: అరేబియా సముద్రంలో భారత నౌకను పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది.

Arun Chilukuri
Published on: 16 Sept 2026 1:36 PM IST
అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాకిస్థాన్‌ నౌక.. భారత్ తీవ్ర నిరసన!
X

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాకిస్థాన్‌ నౌక.. భారత్ తీవ్ర నిరసన!

Arabian Sea: అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వారైచ్‌ను విదేశాంగ శాఖ పిలిపించి బలమైన నిరసన తెలిపింది. పాకిస్థాన్ నౌకాదళ యూనిట్ వ్యవహరించిన తీరు అత్యంత ఆమోదయోగ్యం కానిదని, వృత్తిపరమైన ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని భారత్ స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకకు పాకిస్థాన్ నౌక వేగంగా సమీపించి, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదకర రీతిలో దిశ మార్చుకుంటూ రావడంతో ఢీకొన్నట్లు భారత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో నౌకలకు పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నాయి.

పాకిస్థాన్ నౌక తీరు 1991లో భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలపై ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10 నిబంధనలకు విరుద్ధంగా ఉందని విదేశాంగ శాఖ గట్టిగా వ్యతిరేకించింది.

సముద్రంలో ఇలాంటి ప్రమాదకర ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్థాన్ సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవించాలని ఆ దేశ రాయబారికి భారత్ తేల్చిచెప్పింది. ఈ సందేశాన్ని వెంటనే పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చేరవేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత చార్జ్‌ డి అఫైర్స్‌కు కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు అధికారికంగా నిరసన తెలియజేయాలని కేంద్రం సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.